మరో సెర్చ్‌ ఆపరేషన్‌

0
51
ధవళేశ్వరం ఎర్రకొండపై తెల్లవారుజామున తనిఖీలు
రికార్డులు లేని వాహనాలు స్వాధీనం
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 16 :  అసాంఘిక శక్తుల్ని ఏరివేసి నేరాల నియంత్రణకు అర్బన్‌ పోలీసులు చేపట్టిన కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని ఈ తెల్లవారుజామున ధవళేశ్వరం ఎర్రకొండపై నిర్వహించారు. ఇటీవల ఆదెమ్మ దిబ్బ, శాటిలైట్‌ సిటీలో నిర్వహించిన ఈ సెర్చ్‌ ఆపరేషన్‌ను ఈ సారి ఎర్రకొండపై నిర్వహించారు. అర్బన్‌ ఎస్పీ బి.రాజకుమారి ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్పీ ఆర్‌.గంగాధరరావు పర్యవేక్షణలో సౌత్‌ జోన్‌ డిఎస్పీ పి.నారాయణరావు, ఎస్సీ,ఎస్టీ సెల్‌ డిఎస్పీ ఎస్‌.గంగరాజు, అనేక మంది సి.ఐ.లు, ఎస్‌.ఐ.లు, ఇతర సిబ్బంది  ఆరు బృందాలుగా విడిపోయి మొత్తం 500 ఇళ్ళను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు సరిగా లేని 45 ద్విచక్ర వాహనాలను, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.   ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి వారి వద్ద నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలను, ఆటోలను తనిఖీ చేసి యజమానులు లేని వాహనాలను, అనుమానిత వాహనాలను, పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఈ తనిఖీ సాగింది. ఈ సందర్భంగా పలువురు మహిళలు తరుచు తనిఖీలు నిర్వహించి తమ ప్రాంతంలో నేరస్తులకు అడ్డుకట్ట వేయాలని పోలీస్‌ అధికారులను కోరారు.  వాహనాల యజమానులు వచ్చాక  రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని, ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో నేరస్తుల కదలికలు ఎక్కువగా ఉన్నాయని, అదే విధంగా తీవ్రవాదులకు అనుకూలంగా ఉండే స్లీపర్‌ సెల్స్‌ ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నందున ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. నేరస్తులకు ఆశ్రయం ఇవ్వరాదని పోలీస్‌ అధికారులు స్ధానికులకు సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకూడదని, తల్లిదండ్రులు వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీస్‌ అధికారులు కోరారు. యువత చెడుసావాసాలు పట్టి వ్యసనాలకు బానిసలవుతున్నారని, నేర కార్యకలాపాల్లో పాల్గొంటున్నారన్నారు. ఈ ప్రాంతంలో గుర్తు తె లియని వ్యక్తులు కాని ఇబ్బందిగా ప్రవర్తించే  వారి గురించి సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని డిఎస్పీ నారాయణరావు కోరారు. ఈ తనిఖీలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.  ఈ కార్డన్‌ సెర్చ్‌లో ధవళేశ్వరం సి.ఐ. ఎం.కృపానందం, కడియం సిఐ. ఎం. సురేష్‌లతో పాటు ఏడుగురు ఎస్‌ఐలు, యాంటీ గూండా  స్వ్కాడ్‌ సిబ్బంది, షీ టీం సిబ్బంది, స్పెషల్‌ బ్రాంచి సిబ్బంది, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ సిబ్బంది, ¬ం గార్డులు మొత్తం 150 మంది  వరకు పాల్గొన్నారు.