రాజమహేంద్రవరం రోడ్లపైనా ‘సండే’ సందడి

0
612
రేపు పుష్కర ఘాట్‌ వద్ద ప్రారంభం
కాలువల్లో చెత్త వేస్తే రూ. 100 జరిమానా : కమిషనర్‌ విజయరామరాజు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  22: మురుగు కాలువల్లో చెత్త వేసే వారి నుంచి రూ. 100 అపరాధ రుసుముగా వసూలు చేస్తామని నగర పాలక సంస్ధ కమిషనర్‌ వి.విజయరామరాజు తెలిపారు. తన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో సార్లు హెచ్చరించినా మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల నుంచి అపరాధ రుసుము వసూలు చేయాలన్నది తమ ఉద్ధేశ్యం కాదని, కేవలం ప్రజారోగ్యం కోసమేనన్న విషయాన్ని గమనించాలన్నారు. రెండుమూడు రోజుల్లో అధికారికంగా ప్రకటన విడుదల చేస్తామన్నారు. విజయవాడలో తలపెట్టిన హేపీ సండే కార్యక్రమాన్ని నగరంలో కూడా రేపటి నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు పుష్కరఘాట్‌ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, విద్యార్ధులకు క్రీడలు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆసక్తి కలిగిన వారు స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రేపు ఉదయం 7 గంటలకు హేపీ సండే కార్యక్రమం మొదలవుతుందన్నారు.  నగరంలో శానిటరీ సిబ్బందిని అంతర్గత బదిలీలు చేశామని, దీనివల్ల పారిశుద్ధ్య నిర్వహణ కుదుట పడేందుకు పది రోజులు సమయం పడుతుందన్నారు. సెంట్రల్‌ జోన్‌లో పర్మనెంట్‌ కార్మికులు పనిచేస్తారని, మిగిలిన జోన్లలో తాత్కాలిక కార్మికులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. విలేకరుల సమావేశంలో మేనేజర్‌ శ్రీనివాసరావు, శానిటరీ సూపర్వైజర్‌ నారాయణరావు పాల్గొన్నారు.