అధికారులు ప్రతీ వారం ప్రగతిపై నివేదిక ఇవ్వాలి 

0
105
స్వచ్ఛ భారత్‌ సమీక్షలో మేయర్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  23 : అందరి సహకారంతో బహిర్గత మలమూత్ర విసర్జన రహిత నగరంగా ప్రకటించుకున్నామని, అలాగే మరింత మెరుగైన ఆలోచనలతో స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుకోవడానికి కృషిచేయాలని మేయర్‌ పంతం రజనీ శేషసాయి పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్‌ ప్రగతిపై సోమవారం పారిశుద్ధ్య సబ్‌ – కమిటీ, ఆరోగ్య విభాగపు అధికారులతో తన ఛాంబరులో సమావేశమైన మేయర్‌ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెత్త పునర్వినియోగం, తడి చెత్త పొడి చెత్త, ప్లాస్టిక్‌ వలన దుష్పరిణామాలు, పోస్టర్‌ ఫ్రీ సిటీ వంటి వాటిపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మరింత వేగంగా మెరుగైన ఫలితాలు సాధించాలని, ప్రగతిపై ప్రతీ వారం తనకు నివేదిక అందజేయాలన్నారు. రెస్టారెంట్లు, తినుబండారాలు విక్రయించే ప్రదేశాలు, వాణిజ్య సముదాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అలాగే ప్రజలు కూడా చెత్త నిర్వహణకు తగు ఏర్పాట్లు చేసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. మొబైల్‌ తెరలను ఏర్పాటు చేసి లఘు చిత్రాల ప్రదర్శన ద్వారా స్వచ్ఛ భారత్‌ లక్ష్యాలను, ఆవశ్యకతను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. స్పష్టమైన ప్రణాళికలు, సమయం నిర్ధేశించుకుని దానికి అనుగుణంగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. తరచుగా వీధుల్లోనూ, పాఠశాలల్లోనూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. డ్వాక్రా మహిళలు, విద్యార్ధులు, సామాజిక సంస్థలను కూడా  భాగస్వాములను చేయాలన్నారు. అలాగే ర్యాలీలు నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేయాలని తెలిపారు. స్వచ్ఛ నగరానికి సంబంధించిన నినాదాలను నగరమంతా ప్రదర్శించాలన్నారు. రాజమహేంద్రవరాన్ని  స్వచ్ఛ నగరంగా మలచే క్రమంలో క్రొత్త ఆలోచనలతో చురుకుగా అడుగులు వేయాలని పారిశుద్ధ్య సబ్‌ కమిటీకి సూచించారు. అధికారులు, కమిటీ సమన్వయంతో పనిచేసి ఆశించిన ఫలితాలు రాబట్టాలని కోరారు. ప్రతీ వీధికి ప్రత్యేకంగా ఒక సభ్యుడిని నియమించి ప్రగతిపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను  పాటిస్తూ సాధించిన ప్రగతిని సంబంధిత శాఖకు అధికారుల ద్వారా నివేదికలు అందజేయాలని సూచించారు. మూస విధానం కాకుండా వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలను రూపొందించి ప్రజల్లో ప్రేరణ తీసుకురావాలన్నారు. స్వచ్ఛ నగరం అంశం పారిశుద్ధ్య కమిటీ, అధికారులు తమ గురుతర బాధ్యతా భావించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సబ్‌-కమిటీ చైర్మన్‌ తంగెళ్ళ బాబి, సభ్యులు తంగేటి వెంకటలక్ష్మి, రెడ్డి పార్వతి, కో-ఆప్షన్‌ సభ్యురాలు మజ్జి పద్మ, ఎంహెచ్‌ఓ ఇందిరా, పారిశుద్ధ్య సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.