పిడబ్ల్యుడి వర్క్‌షాపులో 20 మంది కార్మికుల్ని పర్మనెంట్‌ చేయాలి

0
90
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 23 : ధవళేశ్వరంలోని పి.డబ్ల్యు.డి. వర్క్‌ షాపులో 20 మంది దినసరి కార్మికుల ( ఎన్‌.ఎం.ఆర్‌.)ను పర్మనెంట్‌ చేయాలని తెలుగునాడు పి.డబ్ల్యు. వర్క్‌ షాపు అండ్‌ ప్రాజక్ట్‌ కార్మిక సంఘం వ్యవస్ధాపక అధ్యక్షులు యర్రమోతు ధర్మరాజు కోరారు.  ఈ విషయమై గత ప్రభుత్వానికి పలు పర్యాయాలు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. చంద్రబాబు పాలన అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా ఉందని, ఈ దృష్ట్యా దినసరి కార్మికులపై సానుకూలంగా స్పందించి పర్మనెంట్‌ చేయడానికి తగు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అతి పురాతనమైన, చారిత్రాత్మకమైన ఈ వర్క్‌ షాపును 1854లో సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ మహాశయుడు ఏర్పాటు చేశారని,ఈ వర్క్‌ షాపులో 80 మంది పర్మనెంట్‌ కార్మికులు,  20 మంది దినసరి కార్మికులు పనిచేస్తున్నారన్నారు. వీరంతా 50 సంవత్సరాలు దాటి నాలుగైదు సంవత్సరాల్లో పదవీ విరమణ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, పెండింగ్‌లో ఉన్న ఈ కార్మికుల పర్మినెంట్‌ వ్యవహారాన్ని వెంటనే పరిష్కారించాలని ధర్మరాజు కోరారు. ఈ విషయమై ఇటీవల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు వినతి పత్రం సమర్పించగా వీరి పర్మనెంట్‌కు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. లోకేష్‌ను కలిసిన వారిలో టిఎన్‌టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గల్లా రాము, యూనియన్‌ అధ్యక్షులు చిటికెన శ్రీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మడకం కొండలరావు, కార్యనిర్వాహక కార్యదర్శి కారేపల్లి సాయిబాబ తదితరులు ఉన్నారు.