ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు సాధించి తీరతాం

0
75
అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలి – తూర్పున కదిలిన జీపుజాతా – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 27 : ప్రైవేటు రంగంలో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు సాధించేవరకు ఉద్యమం కొనసాగించడం జరుగుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం గోకవరం బస్టాండు అంబేద్కర్‌ విగ్రహానికి గురువారం ఆయన పూలమాల వేసి జెండా ఊపి సామాజిక హక్కుల వేదిక జీపుజాతాను  ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తుందని, ప్రైవేటు రంగంలోనే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఉంటున్నాయన్నారు. ప్రభుత్వరంగంలో కేవలం పదిహేను శాతం, ప్రైవేటు రంగంలో 85 శాతం ఉద్యోగాలు ఉన్నాయని, ప్రైవేటు రంగంలో బిసిలు, ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం, మైనార్టీలకు ఉద్యోగాలు రావడం లేదని, రిజర్వేషన్లు కల్పిస్తేనే ఈవర్గాలకు ప్రైవేటురంగంలో ఉద్యోగాలు వస్తాయన్నారు. ప్రభుత్వపరంగా ఉన్న రిజర్వేషన్లు కూడా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత చదువు ఇబ్బంది కరంగా మారిందన్నారు. సంక్షేమ వసతి గృహాలను మూసివేయడం విచారకరమన్నారు. వీటితో పాటు ఎస్‌సి సబ్‌ప్లాన్‌ నిధులను మళ్ళించరాదని, బిసిలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో జీపుజాతా ప్రారంభించామని నవంబర్‌ 9న చలో కాకినాడ పోరు గర్జనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతిని ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వచ్చేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రావుల వెంకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, సామాజిక హక్కుల వేదిక జిల్లా ఛైర్మన్‌ చొల్లంగి వేణుగోపాల్‌ సందేశాలిచ్చారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మీసాల సత్యనారాయణ, నగర కార్యదర్శి నల్లా రామారావు, ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు, కిర్ల కృష్ణ, తోకల ప్రసాద్‌, నక్కా కిషోర్‌, జుత్తుక కుమార్‌,  నల్లా భ్రమరాంబ, బల్లిన రాము, యడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, శెట్టి నాగమణి, మొగల్‌ జీనత్‌ బేగం, వానపల్లి సూర్యనారాయణ, పామర్తి సూర్యప్రకాశరావు, కుడిపూడి పార్ధసారధి, మార్గాని రామకృష్ణ గౌడ్‌, రెడ్డి రాజు, సూరంపూడి శ్రీహరి, గుత్తుల జయకృష్ణ, పాము బాబూరావు, బవిరి అంజలయ్య, కర్రి నారాయణరావు, కర్రి పద్మశ్రీ, కొర్నాని అను, పల్లికొండ ఈశ్వరరావు, ఆప్‌ జిల్లా కార్యదర్శి వై.శ్రీనివాసరావు, కుక్కా తాతబ్బాయి, వాకచర్ల కృష్ణ, బుడ్డిగ రవి కొండలరావు, నాయకులు, కార్యకర్తలు, నగర ప్రముఖులు, జట్లు కార్మికులు, మహిళలు, విద్యార్థులు పెద్దయెత్తున తరలివచ్చారు. ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, ప్రేమానందం, ఈశ్వరరావు, ముప్పన కుమార్‌, ఉమ, శారద బృందం ఆలపించిన గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి.