జనం చైతన్యంగానే ఉన్నారు… వారికి క్షమాపణలు చెప్పండి : రౌతు 

0
184
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 31 : గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటీ కూడా అమలుచేయని తెలుగుదేశం పార్టీ  జన చైతన్య యాత్రలు చేయడం కాదని.. జన క్షమాపణల యాత్ర చేయాలని  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటీ కోఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు వ్యాఖ్యానించారు. జాంపేటలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నేడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌతు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయినందుకు ప్రజలకు టిడిపి క్షమాపణలు చెప్పాలన్నారు. నెరవేర్చలేని హామీలు ఇచ్చి గత ఎన్నికల్లో టిడిపి గెలిచిందని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. చంద్రబాబుకు అపార అనుభవం ఉందని, రాష్ట్రాన్ని ఒడ్డున పడేస్తారని ప్రజలు ఓట్లు వేస్తే అధికారంలోకి రెండున్నరేళ్ళు గడుస్తున్నప్పటికీ చేసింది ఏమీ లేదన్నారు.  హామీలను ఎందుకు అమలుచేయడం లేదంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారని, దీనికి టిడిపి నాయకులు సమాధానం చెప్పాలన్నారు. మద్యం అమ్మకాలను తగ్గిస్తామన్న హామీని అటకెక్కించి, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్నారు. మద్యం అధిక ధరలకు అమ్మతుంటే మిత్రపక్షమే ధర్నాలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు.  కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును కమిషన్‌ల కోసం రాష్ట్ర చేపడుతుందని ఆరోపించారు. వైఎస్‌ హాయంలో నగరలో 10వేల ఇళ్ళు నిర్మించడం జరిగిందని, ఆనాడు అనేక సర్వేలు జరిపించి, అర్హులను ఎంపికచేస్తే ఇప్పుడు తమవారికి లబ్ధిచేకూర్చేందుకు రీసర్వేలు నిర్వహిస్తూ అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ ఇళ్ళు అని ప్రకటించారని, ఎన్ని ఇళ్ళు, ఎక్కడ నిర్మించారో చెప్పాలని ప్రశ్నించారు.  జాంపేట బ్యాంక్‌ ఎన్నికల్లో తమ పార్టీకి ఒక డైరెక్టర్‌, కో ఆప్షన్‌  డైౖరెక్టర్‌ పదవులు ఇస్తామని బొమ్మన రాజ్‌కుమార్‌ ఫ్యానల్‌ నుంచి హామీ లభించిందని తెలిపారు. డైరెక్టర్‌ పదవికి ముప్న శ్రీను(కేబుల్‌ శ్రీను), కోఆప్ఫన్‌  డైౖరెక్టర్‌ పదవికి లంక సత్యనారాయణలను పార్టీ తరపున ఎంపిక చేసినట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో ప్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలరెడ్డి, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ గుత్తుల మురళీధర్‌, కార్పొరేటర్‌లు బొంత శ్రీహరి, మింది నాగేంద్ర, మజ్జి నూకరత్నం, ఈతకోటి బాపన సుధారాణి, పిల్లి నిర్మల, నాయకులు సుంకర చిన్ని, దంగేటి వీరబాబు, మజ్జి అప్పారావు, గుర్రం గౌతమ్‌, వాకచర్ల కృష్ణ, నీలం గణపతి, కానుబోయిన సాగర్‌, గుదే రఘు, కుక్కా తాతబ్బాయి, గారా త్రినాధ్‌లు పాల్గొన్నారు.