వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వలసలు  

0
378
రేపు జగన్‌ సమక్షంలో చేరనున్న పోలు విజయలక్ష్మీ బృందం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 3 : అసెంబ్లీ ఎన్నికలకు వ్యవధి ఇంకా రెండున్నరేళ్ళకు పైగా ఉన్నప్పటికి పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసుకుని ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేస్తోంది. అందులో భాగంగా పార్టీని పటిష్టపర్చేందుకు పార్టీలోకి కొత్తవారిని ఆహ్వానిస్తున్నారు. ఈ నేపధ్యంలో నగర రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కలిగిన మాజీ కార్పొరేటర్‌, మాజీ ఎమ్మెల్యే దివంగత ఏసివై రెడ్డి సోదరుని కుమార్తెగా సుపరిచితురాలైన  మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మీ మరికొందరు రేపు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఆమెతో పాటు మాజీ కార్పొరేటర్‌ తామాడ సుశీల మరికొందరు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరిన పోలు విజయలక్ష్మీ ఎన్నికల తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.  అయితే మాజీ  ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సిటీ కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు  ఆహ్వానం మేరకు ఆమె జగన్‌ సమక్షంలో  వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు ఈరోజు  రౌతు నాయకత్వంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్ళారు. పోలు విజయలక్ష్మీతో పాటు తామాడ సుశీల, జాంపేట మార్కెట్‌ కమిటీ అధ్యక్షులు తలశెట్ల నాగరాజు, 29 వ డివిజన్‌ తెదేపా మాజీ అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మణికంఠ, మైనార్టీ నాయకులు షేక్‌ వలీ, రాజమండ్రి తమిళ సంఘం అధ్యక్షులు ఎం. మొహిద్దీన్‌ పిచ్చై తదితరులు ఆ పార్టీలో చేరబోతున్నారు. రేపు  లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో  వీరు పార్టీలో చేరనున్నారు.