అక్రమ అరెస్ట్‌లపై సిపిఎం ఆందోళన

0
67
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : దివీస్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వామపక్ష నాయకులను అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఈరోజు ఆందోళన చేపట్టింది. నందం గనిరాజు జంక్షన్‌లోని పార్టీ కార్యాలయం నుండి కంబాలచెరువు వరకు నిరసన ప్రదర్శన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి.ఎస్‌.ప్రకాష్‌ మాట్లాడుతూ దివీస్‌ పరిశ్రమ ఏర్పాటు వల్ల 250 చేపల చెరువులు, కోళ్ళ పరిశ్రమలకు నష్టం కలుగుతుందని, దీనివల్ల 20వేలమంది ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమ ఏర్పాటు వల్ల పది కిలోమీటర్ల మేర చేపల ఉత్పత్తికి నష్టం కలుగుతుందని, పది గ్రామాల ప్రజలు  నష్టపోతారన్నారు. అటువంటి పరిశ్రమ ఏర్పాటుకు అనుమతి ఇవ్వరాదని డిమాండ్‌ చేశారు. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామ ప్రజలకు మద్దతుగా వెళ్ళిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుపై పోలీసులు పిడిగుద్దులు గుద్ది కాలిబూట్లతో తన్ని అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. పారిశ్రామికవేత్తలకు తొత్తులుగా మారి ఓట్లేసిన ప్రజలపై దాడులు చేయడం బాధాకరమన్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ఈనెల 15న సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు, పార్లమెంటరీ బృందం పర్యటించనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.సావిత్రి, ఎస్‌.ఎస్‌.మూర్తి, రంగా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.