పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

0
67
 
విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల జన చైతన్య యాత్రలో గన్ని కృష్ణ
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 4 : ప్రజా సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందని, వాటిని జనంలోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, విశాఖ అర్బన్‌ జిల్లా ఇన్‌ఛార్జి గన్ని కృష్ణ అన్నారు. విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్‌లో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, దక్షిణ నియోజకవర్గంలోని 27వ డివిజన్‌లో ఎమ్మెల్యే గణేష్‌కుమార్‌లతో కలిసి గన్ని కృష్ణ జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్ళి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలుపెరగకుండా కృషిచేస్తున్నారని, పారదర్శకమైన పాలన అందిస్తూ ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నిలుస్తున్నారని కొనియాడారు. రోజూ 18 గంటలపాటు శ్రమిస్తూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబుకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష నాయకుడు జగన్‌ బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, ఆయన కల్లబొల్లి మాటలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈనెల 6న విశాఖలో జగన్‌ చేపట్టే జై ఆంధ్రప్రదేశ్‌ సభ  కేవలం తన ఉనికి కోసమే ఏర్పాటు చేసుకుంటున్నారని విమర్శించారు. అనంతరం మేఘాలయ హోటల్‌లో శాసనమండలి సభ్యులు ఎం.వి.ఎస్‌.మూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు వింజమూరి రామ నరసింహం నాయకత్వంలో 500 మంది బ్రాహ్మణ యువకులు పార్టీలో చేరి తెదేపా సభ్యత్వాలను స్వీకరించారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్సిస్తూ నిధులు విడుదల చేస్తున్న చంద్రబాబు కృషికి యువకులు ఆకర్షితులవుతున్నారని  పలువురు వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో గన్ని వెంట దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఉప్పులూరి జానకిరామయ్య ఉన్నారు.