నియామక తీరునే హైకోర్టు ప్రశ్నించింది

0
78
ఖచ్చితంగా నిజాయితీ గెలుస్తుంది : కారెం శివాజీ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 5 : న్యాయ వ్యవస్ధపై తనకు పూర్తి నమ్మకం ఉందని, ఖచ్చితంగా నిజాయితీ గెలుస్తుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కారెం శివాజీ వ్యాఖ్యానించారు. ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా తన నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో ఈరోజు ఆర్‌ అండ్‌ బి గెస్టు హౌస్‌లో శివాజీ విలేకరులతో మాట్లాడారు. తనకు ముఖ్యమంత్రి అండదండలు, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, దళిత, గిరిజనుల కోసం తాను నిర్విరామంగా కృషి చేశానన్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తన వ్యక్తిత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని,  నియామకం  విషయంలో సాంకేతికపరమైన అంశాలపై మాత్రమే ప్రశ్నించిందన్నారు. అంబేద్కర్‌ జయంతి నాటికి తనను కమిషన్‌ చైర్మన్‌గా నియమించాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు త్వరితగతిన నిర్ణయం తీసుకున్నారని, ఆ క్రమంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లను ప్రభుత్వం సరి చేస్తుందన్నారు. తన నియామకాన్ని దళిత గిరిజనులు ఒక కానుకగా స్వీకరించారని అన్నారు. తన నియామక విషయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ కుట్రలు పన్ని వెన్నుపోటు పొడిచారని, ఖచ్చితంగా దళిత గిరిజనులు బుద్ధి చెబుతారని అన్నారు.  తనపై వైఎస్‌ జగన్‌ ఇన్ని కుయుక్తులు పన్నుతారని తాను భావించలేదన్నారు. కొన్నేళ్ళగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నారా చంద్రబాబునాయుడు షెడ్యూల్డ్‌ కులాలు, తెగలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తూ భూ కొనుగోళ్ళ విషయంలో పెను మార్పులు తెచ్చారని,  అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యా పథకం ద్వారా  రూ. 20 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా అందించే సబ్సిడీని రూ. 35 వేల నుంచి లక్షకు పెంచారని,  ఇచ్చే రుణాన్ని  రూ.1.50 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచి దళిత గిరిజనుల ఆర్ధికాభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. గిరిజనుల కోసం గిరిపుత్రిక కల్యాణ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎల్‌కెజీ నుంచి ఇంటర్‌ వరకు ఉచితంగా కార్పొరెట్‌ విద్యను అందిస్తున్నారని అన్నారు. సబ్‌ ప్లాన్‌ నిధులు ఎస్సీ ఎస్టీలకే ఖర్చు చేస్తున్నారని, చంద్రన్న బీమాతో అందరిలో ధీమా నింపారని అన్నారు. అందుకోసమే ఈ నెల 19న వేలాదిమందితో దళిత గిరిజన మహాగర్జనను చేపడుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా దళిత, గిరిజన సంక్షేమానికి పాటుపడుతున్న సీఎం చంద్రబాబు నాయుడును సత్కరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి దళిత, గిరిజనులు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా మహా గర్జనకు సంబంధించిన కర పత్రాలను శివాజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు వాసు, జిల్లా మాల మహానాడు అధ్యక్షులు బొచ్చా రమణ, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, పిల్లి వెంకట రమేష్‌, గారా త్రినాధ్‌, తుమ్మల తాతారావు, అర్ధాల కుమార్‌, గారా అప్పారావు, కప్పల వెలుగుకుమారి పాల్గొన్నారు.