బెస్ట్ ప్రాక్టీసెస్ పై గన్నీస్ అవార్డులు

0
140

(శనివారం నవీనమ్)

దేశ, విదేశాల్లో పేరుప్రఖ్యాతులు వున్న కార్డియోథరాసిక్ సర్జన్ పద్మశ్రీ, డాక్టర్ యాళ్ళ గోపాల కృష్ణ – గన్ని సత్యనారాయణమూర్తి స్మారకోపన్యాసం ఇచ్చి అవార్డుని అందుకున్నారు. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీని దిగువమధ్య తరగతి వారికి కూడా అందుబాటులోకి తెచ్చిన మరొక కార్డియాలజిస్టు డాక్టర్ పి రమేష్ -గన్ని సుబ్బలక్ష్మి స్మారకోపన్యాసం ఇచ్చి అవార్డుని అందుకున్నారు.

తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం గన్ని కృష్ణ, డాక్టర్ గన్ని భాస్కరరావు ఏర్పాటు చేసిన ఫౌండేషన్ వైద్యరంగంలోని నిష్ణాతులతో ఏడాదికోసారి స్మారకోపన్యాసాలను ఇప్పించి, సైటేషన్ తో, గోల్డ్ మెడల్ తో, నగదుతో సత్కరిస్తారు. ఇలా మొదటిసారి 2016 సంవత్సరానికి స్మారకోపన్యాసం చేసిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే 92.8 శాతం సక్సెస్ రేటుతో పదివేలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి గుండె మార్పిడి, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో పనిచేసే గోఖలే తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో నెలకోసారి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నారు.

ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టుగా అవిభక్త ఆంద్రప్రదేశ్ లో మొట్టమొదటి బెలూన్ వేసన రమేష్ తనపేరుమీదే రమేష్ హాస్పిటల్ స్ధాపించి గుండెస్ధితిగతుల పై మండల కేంద్రాల్లో ఉచిత వైద్య పరీక్షలు చేయిస్తున్నారు.

జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఇద్దరూ ఇచ్చిన స్మారకోపన్యాసాలలో హృద్రోగ నిర్ధారణ, నివారణల్లో వచ్చిన మార్పులను తమ తమ అనుభవాలను వివరించారు. కొన్ని ముందుజాగ్రత్తలు, నివారణా చర్యల వల్ల గుండెజబ్బుల వల్ల మరణాల్లో 50 శాతం వరకూ అరికట్ట వచ్చని వివరించారు.

సాయంత్రం జరిగిన కాలేజి డే వేడుకల్లో డాక్డర్ రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవిభజన తరువాత వైద్యవసతులు లేని ఆంధ్రప్రదేశ్ లో మనం వున్నామన్న వాదన సరికాదని జిఎస్ఎల్ మెడికల్ కాలేజి, జనరల్ హాస్పిటల్ ను చూస్తే స్పష్టమౌతుందని అన్నారు.

డాక్టర్ గోపాల కృష్ణ గోఖలే మాట్లాడుతూ ”మేముసీనియర్లు చేస్తున్న సర్జరీలను చూసి ఆపరేషన్లు నేర్చుకున్నాము. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాదిరిగా మనకు కూడా సిములేటర్ లాబ్స్ వుంటే బాగుండునని అనుకునే వాడిని…సౌత్ ఆసియాలోనే మొదటి సిములేటర్ లాబ్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో వుందని విని ఆశ్చర్యం కలిగింది. ఇ లాబ్ లో కొన్ని మాడ్యూల్స్ లో ట్రెయినింగ్ తీసుకోడానికి మరో సారి వస్తాను. కేవలం పదమూడేళ్ళలలోనే ఇంత వృద్ధి అనూహ్యంగా వుంది” అన్నారు.

ఈ ఇద్దరినీ గన్ని సోదరులు సన్మానించారు. ప్రిసిపాల్ డాక్టర్ వైఎన్ శర్మ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టివిఎస్ పి మూర్తి సందేశాలు ఇచ్చారు.

విలువలకు నిలువుటద్దం! – కీర్తిశేషులు గన్ని సత్యనారాయణ మూర్తి (1928 -2007)

స్వయం కృషే సాధనంగా ఆత్మవిశ్వాసం, నిబద్ధతలే మూలధనంగా ఉన్నత శిఖరాలకు చేరుకునే కొద్దిమందిలో గన్ని సత్యనారాయణ మూర్తి ముందు వరుసలో నిలుస్తారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించి స్వతంత్ర ప్రవృత్తి వల్ల పెత్తందార్లను కాదని, కక్షసాధింపుల ధిక్కరించి, వ్యాపారాన్ని ప్రారంభించి, ఆటుపోట్లను ఢీకొని, వాణిజ్య కార్యకలాపాలను హెచ్చుమందికి ఉపాధి, అవకాశాలు ఇచ్చే శాఖోపశాఖలు గా విస్తరించిన విలువైన మనిషి. స్వేచ్ఛా స్వాతంత్రాలే ఊపిరిగా, నిబద్ధతే వెన్నెముకగా ఆదర్శవంతమైన జీవనం నెరపిన అచ్చమైన రైతు గన్ని సత్యనారాయణమూర్తిగారు!
అతిథి దేవో భవ! – కీర్తిశేషులు శ్రీమతి గన్ని సుబ్బలక్ష్మి (1935 – 1996)

నిరంతరాయంగా వచ్చిపోయే బంధుమిత్రులు, ఆశ్రితులు, పనివారి కోసం అఖండ జ్యోతి మాదిరిగా అక్షయపాత్రను పోలిన వంటశాల యజమానురాలు గన్ని వారి గృహలక్ష్మి సత్యనారాయణమూర్తి గారి సహధర్మచారిణి శ్రీమతి సుబ్బలక్ష్మి దక్షత ఓర్పు, సహనం ఆ కుటుంబానికి స్ఫూర్తి వంతమైన జ్ఞాపకమైంది. చదువుకునేవాళ్ళకీ, చదువు చెప్పే వాళ్ళకీ వారి నివాసమే ఆశ్రయాన్ని ఇచ్చింది.

ఎవరెవరికో ఎందరెందరికో నీడ ఇచ్చిన చెట్టులాంటి ఆమె గారి జ్ఞాపకాలన్నీ జిఎస్ఎల్ (గన్ని సుబ్బలక్ష్మి) మెడికల్ కాలేజీగా రూపు దిద్దుకున్నాయి.

ఇది స్ఫూర్తివంతమైన విలువలను గౌరవించే ప్రయత్నం

ప్రత్యక్షంగా, పరోక్షంగా మా తల్లిదండ్రులు సమాజం పట్ల నిర్వర్తించిన బాధ్యతలను చిరకాలం నిలిపి వుంచాలన్న ఆలోచనతో వారి పేరిట వైద్యరంగంలో అత్యుత్తమమైన సేవలు చేస్తున్నవారికి అవార్డులను ఇవ్వాలని పెద్దల ప్రోత్సాహంతో నిర్ణయించామని గన్ని సోదరులు స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని వివరించారు.