9న ఛలో కాకినాడకు తరలిరండి 

0
46
పోరుగర్జనకు సిద్ధమవుతున్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి శ్రేణులు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎస్‌సి, ఎస్‌టి, బిసి మైనార్టీల సమస్యలు పరిష్కరించాలని తదితర డిమాండ్ల సాధనకై ఈనెల 9న ఛలో కాకినాడకు వేలాదిమంది తరలిరావాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ తాటిపాక మధు పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆదివారం పోరుగర్జన సభ గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వరంగం మూతపడి ఉద్యోగావకాశాలు రాక నిరుద్యోగులు రోడ్డును పడుతున్నారని, ఇటువంటి తరుణంలో ప్రైవేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి వర్గాలకు రిజర్వేషన్‌ కల్పించాలని మధు డిమాండ్‌ చేశారు. రెసిడెన్షియల్‌ స్కూల్సు పేరుతో క్రమక్రమంగా వసతి గృహాలను ఎత్తివేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల హామీలలో భాగంగా బిసి సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత చేస్తానని హామీ ఇచ్చి రెండున్నరేళ్ళు పూర్తికావస్తున్నా ఇప్పటికే హామీని అమలు చేయలేదని తప్పుపట్టారు. అంతేకాకుండా ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధులను ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు, ఆర్‌అండ్‌బి రహదారులకు కేటాయించడమంటే దళిత, గిరిజన సంక్షేమాన్ని విస్మరించేడమేనని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 50 వసతి గృహాలను ఎత్తివేస్తున్నారని, 2019 నాటికి సంక్షేమ హాస్టళ్లను ఎత్తివేయాలని ప్రపంచ బ్యాంకు షరతులను ఆయన పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర నాయకులు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు బాబు వస్తే జాబు వస్తాదని ఆశ చూపించి హామీలు గుప్పించి అధికారం చేపట్టాక ఉద్యోగాలు ఇవ్వడం మాటెలా ఉన్నా ఉన్న ఉద్యోగాలు ఊడపీకుతున్నారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేయకుండా నాన్చుతున్నారని, రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుందని, ఇప్పటికైనా పాలకులు మీనమేషాలు లెక్కించకుండా వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయకపోతే నిరుద్యోగులు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన  కార్యదర్శి కిర్లకృష్ణ మాట్లాడుతూ ఈనెల 9న ఉదయం పది గంటలకు కాకినాడ కలెక్టరేట్‌ వద్ద మహాధర్నా ప్రారంభమవుతుందని, ఈధర్నాకు ముఖ్యఅతిధిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మాజీ ఎంపి జివి హర్షకుమార్‌ తదితర సామాజిక నాయకులందరూ పాల్గొంటారని, జిల్లాలోని ప్రజానీకం రాజకీయాలకు అతీతంగా ధర్నాకు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో  నగర సహాయ కార్యదర్శులు  బల్లిన రాము, శెట్టి లత్సాలు తదితరులు పాల్గొన్నారు.