యాప్‌ ద్వారా కార్పొరేషన్‌ పాఠశాలల్లో హాజరు పర్యవేక్షణ

0
42
మురికివాడల్లో వైద్యుల సేవలు – కమిషనర్‌ వి.విజయరామరాజు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : నగరపాలక సంస్థ ప్రవేశపెట్టిన యాప్‌ ద్వారా నగరపాలక సంస్థ పాఠశాలల్లోని విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్‌ వి.విజయరామరాజు వెల్లడించారు. ప్రతిరోజూ  ఉదయం 10.30 గంటలకల్లా నగరపాలక సంస్థ పాఠశాలల్లోని విద్యార్ధులు, ఉపాధ్యాయుల హాజరు వివరాలు తనకు అందుతున్నాయన్నారు.  ఈ విధానం వల్ల విద్యార్ధుల హాజరు సంఖ్య పెరిగిందన్నారు. ఉపాధ్యాయులు సకాలంలో పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొద్దిరోజుల వరకు 10వేల 500 మంది విద్యార్ధులకుగాను 3500 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యేవారని, యాప్‌ ద్వారా పర్యవేక్షణ జరిపి,  విద్యార్ధుల హాజరుపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించడంతో గైర్హాజరీ సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే నగరపాలక సంస్థ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రాథమిక పాఠశాలలకు  ప్రత్యేక సూపర్‌వైజర్‌ను, హైస్కూళ్ళకు డిప్యూటీ డిఇఓను నియమించామని వివరించారు. నగరపాలక సంస్థ అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు మురికివాడలు, పేదలు నివసించే ప్రాంతాల్లో పర్యటించి వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామని కమిషనర్‌ తెలిపారు.