రసాయన శాస్త్రంలో కొటికలపూడికి డాక్టరేట్‌

0
55
రాజమహేంద్రవరం, నవంబర్‌ 6 : పొగాకు రంగంలో రసాయనశాస్త్ర విభాగంలో పరిశోధన చేసిన నగరానికి చెందిన కొటికలపూడి వెంకట  సత్యనారాయణకు డాక్టరేట్‌ లభించింది.  ఈ మేరకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిశోధనా విభాగం కో ఆర్డినేటర్‌ ఆచార్య రత్న శిలామణి  ఒక ప్రకటనలో తెలియజేశారు. కొటికలపూడి కేంద్ర పొగాకు పరిశోధన సంస్ధ (సిటిఆర్‌ఐ), రాజమండ్రి ఆధ్వర్యంలో హెచ్‌.డి.బి.ఆర్‌.జి అనే పొగాకు రకంపై రిటైర్డ్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ సి.వి.నరసింహారావు పర్యవేక్షణలో రసాయనిక, జీవరసాయన, సువాసన, పొగ మరియు వికర్బన భాగాలు అనే అంశాలతో  కూడిన విమర్శనాత్మకమైన  పూర్తిస్థాయి రసాయన పరిశోధన చేసినందుకు ఆయనకు ఈ డాక్టరేట్‌ ప్రదానం చేయడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సాలిడ్‌ స్టేట్‌ – 13సి ఎన్‌.ఎం.ఆర్‌. విశ్లేషణ దేశీయ పొగాకుపై ఈ పరిశోధన ప్రథమ ప్రయత్నమని తెలిపారు. ఈ పరిశోధన వల్ల హెచ్‌.డి.బి.ఆర్‌.జి. అనే రకం పొగాకు రసాయనిక పరిణామాలపై వాస్తవ లక్షణాలను నిరూపితమైంది. ఈ పరిశోధన పొగాకు శాస్త్రవేత్తలకు, పొగాకు ఆధారిత పరిశ్రమలకు, ఔషధ పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉంటుందని డాక్టరేట్‌ పొందిన కొటికలపూడి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఈ పరిశోధనకు సహకారం అందించిన పరిశోధనా పర్యవేక్షకులు డాక్టర్‌ సి.వి.నరసింహారావుకు మరియు కేంద్ర పొగాకు పరిశోధనా సంస్థ వారికి కొటికలపూడి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టరేట్‌ పొందిన సత్యనారాయణకు  సిటిఆర్‌ఐ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు పలువురు మిత్రులు అభినందనలు తెలియజేశారు.