మీ తీరుతో మాకు చెడ్డ పేరు

0
379
సమస్య లేకున్నా మెట్లు తొలగిస్తారా?
నగర పాలక సంస్ధ సిబ్బంది తీరుపై గన్ని, ఆదిరెడ్డి ఆగ్రహం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 7 : కింది స్థాయి అధికారుల అత్యుత్సాహం వల్ల పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని, వారు పని తీరు మార్చుకోకుంటే సహించబోమని, ఈ విషయాన్ని  ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడి ్డ అప్పారావు హెచ్చరించారు. స్ధానిక 41 వ డివిజన్‌ శ్రీరామనగర్‌-లూధర్‌గిరి  మధ్య ఉన్న రహదారిలో ఈరోజు ఉదయం నగర పాలక సంస్థ ప్రణాళిక విభాగం సిబ్బంది ఎటువంటి సమాచారం లేకుండా గృహాలకు సంబంధించిన మెట్లను జెసీబీతో తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. ఎటువంటి రద్దీ లేని రహదారిలో,ముంపునకు గురి కాని వీధిలో నగర పాలక సంస్ధ సిబ్బంది చేసిన ఈ అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. విషయం తెలుసుకున్న గన్ని కృష్ణ, ఆదిరెడ్డి, స్ధానిక కార్పొరేటర్‌ మర్రి దుర్గా శ్రీనివాస్‌ అక్కడకు చేరుకుని స్ధానికులతో మాట్లాడారు. దీనిపై గన్ని, ఆదిరెడ్డిలు నగర పాలక సంస్ధ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ వీధిలో మురుగు కాలువను ఆక్రమించి మెట్లు కట్టడం వల్ల మురుగునీరు పారుదలకు ఇబ్బంది కలుగుతుందని ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము చర్యలు తీసుకున్నామని  వారు సమాధానమిచ్చారు.  సంబంధం లేని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై వాస్తవాలు తెలియకుండా అన్యాయంగా జెసీబీతో ఆక్రమణలను తొలగించడం  సరికాదని, ఇళ్ళలో నివసించే వారు ఇపుడు ఎలా వెళతారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్లను తొలగించిన క్రమంలో మంచినీటి పైప్‌లైన్లు ధ్వంసమయ్యాయని, వారికి మంచినీరు ఎలా సరఫరా అవుతాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగడం లేదని, తుగ్లక్‌ పాలన  తలపిస్తోందని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా కమిషనర్‌ విజయరామరాజుతో గన్ని ఫోన్‌లో మాట్లాడారు. ఆక్రమణలను తొలగించే పక్షంలో స్థానికులకు సమాచారం ఇవ్వాలని, అయినా ఆ వీధిలో ఎటువంటి డ్రైనేజీ సమస్య లేదన్నారు. కాలువలోని చెత్తను ఎప్పటికపుడు తొలగించేందుకు వీలుగానే ఉందని చెప్పారు. కింది స్థాయి అధికారుల పనితీరు తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తోందని , ఈ పద్ధతిని తాము సహించబోమన్నారు. సంఘటనా స్ధలాన్ని తాను ఈ సాయంత్రం పరిశీలిస్తానని కమిషనర్‌ హామీ ఇచ్చారు.