అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : గోరంట్ల 

0
74
రాజమహేంద్రవరం, నవంబర్‌  9 : అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని రాజమహేంద్రవరం రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. రూరల్‌ మండలం కొంతమూరు గ్రామ పంచాయితీ పరిధిలో జంగాల కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు మంగళవారం ప్రభుత్వం అందిస్తున్న 10 కేజీల బియ్యంతోపాటు, ఒక్కో కుటుంబానికి శాసనసభ్యులు స్వయంగా ఒక దుప్పటి, చీర, పిల్లలకు బట్టలు, హార్లిక్స్‌ డబ్బా, పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ళు కోల్పోయిన 95 కుటుంబాలకు ప్రభుత్వం తరపున తప్పనిసరిగా ఇళ్ళు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.  గృహ నిర్మాణ శాఖ అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్ళామన్నారు. ఇళ్ళు మంజూరుకు ఆయన కూడా అనుమతిచ్చారన్నారు. జంగాల కాలనీ రోడ్డు ఆటోనగర్‌ వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. త్వరలో విద్యుత్‌ పునరుద్ధరించడం జరుగుతుందని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదటవం వల్ల నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న  సహాయంతోపాటు స్వచ్చంద సేవా సంస్థలు కూడా సాయం అందించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు. అగ్ని ప్రమాద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులకు తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ తహశీల్దార్‌ జి.భీమారావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, గ్రామ కార్యదర్శి విజయ్‌రెడ్డి, ఆర్‌ఐ శ్రీమతి కుమారి, మార్ని వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.