ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వొద్దు

0
151
ఆర్పీసీ, లోక్‌సత్తా ఉద్యమ సంస్ధ డిమాండ్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : కులాల పేరుతో విధ్వంసాలకు పాల్పడుతున్న వ్యక్తుల ఆగడాలను అరికట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఆయన  లోక్‌సత్తా ఉద్యమ సంస్ధ నగర కన్వీనర్‌ ఎం.వి.రాజగోపాల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం ఉద్యమాలకు అమాయకులు బలవుతున్నారని, తుని ఘటనలో తానే బాధ్యుడినని ఆయన ఒప్పకున్నా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ముద్రగడ చేస్తున్న ఉద్యమాల వెనుక విధ్వంసాలు ఉంటున్నాయని,  ఈ నెల 16 నుంచి ఆయన చేపట్టే పాదయాత్రకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని సూచించారు. ఇలాంటి విధ్వంసాల వల్ల అమాయక యువకులు కేసుల్లో ఇరుక్కుపోయి వారి జీవితాలు దెబ్బతింటున్నాయన్నారు. ముద్రగడను అరెస్టు చేయకపోతే తామే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, 16  నుంచి ఆయన చేపట్టే పాదయాత్రను అడ్డుకుంటామన్నారు. రాజగోపాల్‌ మాట్లాడుతూ కులాన్ని ఉన్మాదంలా మార్చేశారని, ఎక్కడ చూసినా కులాల పేరుతో వనసమారాధనలు, సమావేశాలు జరుగుతున్నాయన్నారు.  రిజర్వేషన్లు పేదరిక ప్రాతిపదికన ఉండాలని, కుల ప్రాతిపదికన తీసివేయాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో చెరుకువాడ నరసి ంహరావు, పెండ్యాల కామరాజు, సిహెచ్‌ కామేశ్వరరావు, డి వి  రమణమూర్తి, కాసా రాజు, సత్యనారాయణ, వర్మ, బుడ్డే త్రినాధ్‌, ఖండవల్లి భాస్కర్‌, కొత్తపల్లి భాస్కరరామ్‌, లంక దుర్గాప్రసాద్‌, ద్వాదశి శ్రీనివాస్‌, బర్ల శ్రీనివాస్‌, కొల్లి సిమ్మన్న, ఎస్‌ కె జిలానీ, జె.కాళేశ్వరరావు పాల్గొన్నారు.