పెద్ద నోట్ల రద్దు దేశానికి శుభ సూచకం

0
56
మోడీ నిర్ణయంపై గన్ని కృష్ణ హర్షం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 9 : దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయం తీసుకోవడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. నల్లధనాన్ని అరికట్టడం కోసమే గాక పొరుగు దేశాల నుంచి దిగుమతి అవుతున్న దొంగ నోట్లను కూడా అడ్డుకోవడానికి మోడీ ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారని, ఈ నిర్ణయం బహుదా ప్రశంసనీయమన్నారు. దీనికి ప్రేరణ మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కావడం తెలుగు వారందరికి గర్వకారణమన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి రూ. 500, రూ.1000 నోట్ల ను రద్దు చేయాలని సీఎం చంద్రబాబు చాలా కాలంగా కోరుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా  ప్రస్తావించారు. విధాన నిర్ణయాల్లో విద్యావంతులు, వృత్తి నిపుణులు ఉండటం దేశ ప్రయోజనాలకు ఏ విధంగా దోహదపడుతుందో మనం చూస్తున్నామని, రాజకీయ రంగానికి ప్రొఫెషనలిజాన్ని ఆపాదించిన చంద్రబాబు ఇతర రాష్ట్రాలకు గతంలోనే మార్గదర్శి కాగా, సాంకేతికతను, కమ్యూనికేషన్లను ఉపయోగించి ఇంత పెద్ద దేశంలో నరేంద్రమోడీ మెరుపు దాడి  మాదిరిగా విప్లవాత్మకమైన నిర్ణయాన్ని సమర్ధవంతంగా అమలు చేశారని  ఆయన అన్నారు. నల్లధనాన్ని అరికట్టడానికి  పెద్ద నోట్లు రద్దు  చేయడం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తాత్కాలికంగా అసౌకర్యం కలిగినా నాలుగైదు రోజుల్లో అంతా సర్ధుబాబు అవుతుందని ఆయన అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దేశ ఆర్ధిక వ్యవస్ధకు శుభసూచకమని గన్ని వ్యాఖ్యానించారు.