ఇది ”చిల్లర” సమస్య కాదు

0
315

ఇది ”చిల్లర” సమస్య కాదు
పెద్ద చేపలు చిన్నవాటిని మింగేసే ప్రమాదం
(శనివారం నవీనమ్)

రోజూ కారు తుడిచి, ఐదురోజులకోసారి కడిగి పాలిష్ పెట్టి, పదిరోజులకోసారి వాక్యూమ్ క్లీనర్ తో లోపల తుడిచే మాధవ్ తో డిసెంబర్ ఒకటి నుంచి నీ సర్వీసు అవసరం లేదని చెప్పాను. అప్పటికే అతను డల్ గా వున్నాడు. మరికొందరు కూడా అతని పని అవసరం లేదని చెప్పి వుంటారని అతన్ని చూడగానే అర్ధమైపోయింది.

మాధవ్ ఔత్సాహిక యువకుడు. ప్రొఫెషనల్ కారు డ్రైవర్. 40 కి పైగా చిన్నకార్లున్న మా అపార్టు మెంటులోకి వచ్చి క్లీనింగ్ క్లాత్, షాంపూ, లిక్విడ్ డెటర్జంట్లు నావే! నెలకు 500 ఇవ్వండి కారు క్లీన్ గా వుంచుతాను అన్నాడు. అతని చొరవ, ఉత్సాహాలే అతనికి 15 వరకూ కార్ల క్లీనింగ్ అవకాశాన్ని ఇచ్చింది.

సర్వీసు సెక్టార్ లో ఉపాధి అవకాశాలు ఎలా పెరుగుతాయో? ఎలా పెంచుకోవచ్చో తరచు చెప్పే చంద్రబాబు నాయుడు మాటలకు మాధవ్ ఒక ఉదాహరణై నిలుస్తాడు.

నేను కూడా సర్వీసు సెక్టార్ లో జీవిస్తున్న వాడినే! జనవరి నుంచి డ్రైవర్ ని పెట్టుకుంటే నా ఏజ్ దృష్ట్యా కంఫర్ట్ బుల్ గా వుంటుందని ఆలోచిస్తున్నాను. పెద్దనోట్ల రద్దు తరువాత మారుతున్న పరిస్ధితులను గమనిస్తున్నాను. నా అంచనా ప్రకారమే ఈ రోజు ఉదయమే ఒక అడ్వటైజర్ నాకు ఫోన్ చేశారు. ”మన యాడ్ ప్లాన్, షెడ్యూల్స్ కాన్సిల్. న్యూ, చీపర్ మెథడ్స్, టెక్నాలజీస్ ఆలోచించండి.” అన్నారు!

ఆయన నిర్ణయం వల్ల వచ్చే నాలుగు నెలల్లో నా ఆదాయాల్లో 30/40 వేలరూపాయలు తగ్గిపోతుంది. దీంతో డ్రైవర్ ను పెట్టుకునే ఆలోచనను డిలిట్ చేసేశాను.

నా ఆదాయాలన్నీ చెక్కులద్వారా వచ్చేవే! నాదగ్గర అన్ అకౌంటెడ్ డబ్బు లేదు. సరళీకృత ఆర్ధిక విధానాల వల్ల వచ్చిన అవకాశాలను అందుకుని జీవనప్రమాణాలను పెంచుకుంటున్న అనేకమందిలో నేను ఒకడిని!

బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్యల వల్ల చిల్లరదొరక్క ప్రజలు ఎదుర్కొంటున్న తాత్కాలిక కష్టాలను పక్కనపెడితే అనేకరంగాలు కోలుకోడానికి ఆరునెలల నుంచి మూడేళ్ళు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజల నిత్యావసరాలలో ఒకటైన వస్త్రాల వ్యాపారం నిలదొక్కుకోడానికే ఆరునెలలు పడుతుంది. రియల్ ఎస్టేట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రంగాలు ఎప్పటికి కోలుకుంటాయో తెలియదు.

1978 జనవరి 15 న అప్పటి ప్రభుత్వం 1000, 5000,10000 రూపాయల నోట్లను రద్దు చేసింది. అపుడు నేను సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ఆవార్త దినపత్రికల్లో చూసినపుడు ఇన్నేసి రూపాయల నోట్లు కూడా వుంటాయా అని ఆశ్చర్యం కలిగింది. అపుడు వందరూపాయల నోటునాకు తెలుసు. అపుడు నేను నా చేతుల మీదుగా ఖర్చుపెట్టినవి హెచ్చుగా రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నోట్లే! ఇపుడు నా కొడుకులు ఖర్చు పెడుతున్న నోట్లలో చిన్నవి వంద రూపాయల నోట్లు! ఇంతగా పెరిగిపోయిన క్యాష్ వాల్యూమ్ వెనుక ప్రపంచవ్యాప్తమైన ఆర్ధిక ధోరణులు వున్నాయి.

ప్రయివేటీకరణ విధానాలను ఆసరాగా చేసుకుని
అధికారంలో వున్న రాజకీయవేత్తలు, అధికారుల పాల్పడిన అవినీతి కూడబెట్టే ధనాన్ని ”క్రోనీ కేపిటలిజం” అంటారు. ఇది ప్రపంచమంతటా వున్నదే! ఇండియాకు సంబంధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఆకస్మిక క్రోనీ కుబేరులైపోయిన వారి సంఖ్య 2 వేలకు చేరింది. లంచాల డబ్బుని వారు ఆస్ధులుగా మార్చేయడం, ఆ ఆస్ధులు ఆదాయ వనరులుగా మారడం జరిగింది. ఈ క్రమంలోనే సర్వీసు రంగం కూడా విస్తరించింది. అవినీతితో సంబంధం లేకపోయినా కూడా సర్వీసు సెక్టారు పటిష్టంగా విస్తరిస్తోంది.

అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో విదేశీ బ్యాంకుల నుంచి 75 లక్షలకోట్ల రూపాయల నల్లధనాన్ని తీసుకువస్తామని ఉత్త మాటలు చెప్పిన నరేంద్రమోదీ ఆపని వదిలేసి దేశమంతటినీ బ్యాంకుల ముందు క్యూలో నిలబెట్టేశారు. వంద, యాభైనోట్లు లేకుండా చేసేసి ప్రజలకు నరకం చూపిస్తున్నారు.

ప్రభుత్వం చెబుతున్నట్టు ఎటిఎంలలో డబ్బు లేకపోవడం, చిల్లర దొరక్కపోవడం తాత్కాలిక ఇబ్బందే కావచ్చు. ఇపుడు కష్టపడుతున్నా ఇది మంచిపనే అని మధ్యతరగతి ప్రజలు టివిల ముందు చెప్పడం ఆశ్చర్యంగా వుంది.

ఇది మహా అయితే నెలరోజులు వుండే అసౌకర్యమే కావచ్చు. డబ్బు చెలామణి లేక ఏర్పడే ఆర్ధిక మాంద్యం వల్ల అనేకరంగాలు చతికిలబడిపోయి ఏర్పడే నిరుద్యోగ సమస్యలకు, మూసుకుపోయే ఉపాధి అవకాశాలకు పరిష్కారాలు ఏమిటో చెప్పేవారు.

ఈ రంగాల్లో యజమానులుగా వున్నవారు తెరమరుగైపోతారు. జీవించడానికి ఎక్కడెక్కడో ఉద్యోగులైపోతారు. వైట్ మనీ వున్న పెద్దపెద్ద కంపెనీలు ఆయా రంగాల్ని ఆక్రమించుకుంటాయి. ఇప్పటికే పరచివున్న రెడ్ కార్పెట్ మీదుగా విదేశీ పెట్టుబడులు చతికిలబడిన దేశీయ రంగాల్లో దర్జాగా ప్రవేశిస్తాయి.

బ్లాక్ మనీని ఆపెయ్యడానికి మోదీగారు తీసుకున్న చర్యలు స్వదేశీ రంగాలను చావగొట్టి చెవులు మూస్తుండగా ఆస్ధానాల్లోకి ”స్వదేశీ, విదేశీ పెద్దచేపలు” చొరబడిపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

పెద్దనోట్ల రద్దుపై ఆర్ధిక నిపుణులు ఇంకా లోతైన విశ్లేషణలు ప్రారంభించలేదు. మరి ”చిన్న ఇబ్బందులను ఓర్చకుందాం”…అని బ్యాంకుల ముందు పడిగాపులు పడుతున్న వాళ్ళు ఎందుకు ఎలా అంటున్నారో నాకు అర్ధం కావటంలేదు.

ఫేజ్ మారుతున్న దశలో దేశీయంగా ఎకనామిక్ స్టిమ్యులేషన్ ఆగిపోతే మేక్ ఇన్ ఇండియా, స్వావలంబన, ఉపాధి అవకాశాల పెంపుదల ఎలా సాధ్యమో నాకు బోధపడటం లేదు

అందుకే నేను చాలామంది మాదిరిగా మోదీగారికి చప్పట్లు కొట్టలేకపోతున్నాను. – పెద్దాడ నవీన్