టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలకు ఎంపికైన ఆచంట ఉమేష్‌కుమార్‌  

0
67
రాజమహేంద్రవరం, నవంబర్‌ 13 : ఏలూరులో ఇటీవల జరిగిన రాష్ట్ర టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలలో కాంస్య పతకం సాధించి రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఆచంట ఉమేష్‌ జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. కాగా ఈ రాష్ట్ర జట్టును ఈ సంవత్సరంలో జరిగిన 5 స్టేట్‌ ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌ ఆధారంగా ర్యాంక్‌లను బట్టి రాష్ట్రస్థాయిలో  నలుగురిని ఎంపిక చేశారు. ఈ సంవత్సరంలో జరిగిన రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌ పోటీలలో వరుసగా రాజమహేంద్రవరం, భీమవరం, అనంతపురం, గుంటూరులో జరిగిన చాంపియన్‌ షిప్‌లలో ఉమేష్‌ మెడల్స్‌  సాధించి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. ఈ రాష్ట్ర జట్టు జనవరి 14 నుండి 29 వరకు విజయవాడలో జరిగే కోచింగ్‌ క్యాంపులో పాల్గొని జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు గుర్గాస్‌ (హర్యానా)లో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. ఆచంట ఉమేష్‌ గతంలో 27 సార్లు ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు ఎంపికై జాతీయస్థాయి పోటీలలో పాల్గొన్నారు. 28వ సారి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆచంట ఉమేష్‌ను మెగాస్టార్‌ చిరంజీవి సత్కరించారు. ఈ సందర్భంగా ఆచంట ఉమేష్‌ మాట్లాడుతూ తనను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు, గన్ని కృష్ణకు, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు, ఎపిటిటిఏ ప్రెసిడెంట్‌ వి.భాస్కరరామ్‌కు, ఎపిపిటిఏ సెక్రటరీ సుల్తాన్‌కు, వైఎస్సార్‌సిపి యూత్‌ స్టేట్‌ ప్రెసిడెంట్‌ జక్కంపూడి రాజాకు, సెలక్షన్‌ కమిటీకి, కోచ్‌ వి.టి.వి.సుబ్బారావుకి కృతజ్ఞతలు తెలిపారు.