సర్వం శివోహం

0
63
గోదావరిలో భారీగా పుణ్యస్నానాలు
కిటకిటలాడిన శైవాలయాలు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 14 : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని ఈరోజు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గోదావరి నదిలో భారీగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. తెల్లవారుజాము నుంచే నగరంలోని కోటిలింగాల ఘాట్‌, పుష్కర ఘాట్‌, గౌతమ ఘాట్‌, సరస్వతీ ఘాట్‌ తదితర స్నాన ఘట్టానలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రికే నగరానికి చేరుకుని అర్ధరాత్రి నుంచి నదీ స్నానాలు చేశారు. ఈ పర్యాయం కార్తీక సోమవారం, పౌర్ణమి ఒకే రోజు రావడాన్ని మరింత ప్రాశస్థ్యంగా భావించి భక్తులు వేలాదిగా పుణ్య స్నానాలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ స్నాన ఘట్టాల వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. కొందరు నదిలో దీపాలను విడిచిపెట్టగా మరికొందరు తీరాన దీపాలు వెలిగించి పరమ శివుణ్ణి పూజించారు.  అనంతరం వివిధ శైవాలయాలను సందర్శించి పూజలు, అభిషేకాలు జరిపారు. పూజా సామగ్రి, మారేడు, ఉసిరి దళాల విక్రయాలతో ముఖ్య రహదారులు కిటకిటలాడాయి. మహిళలంతా ఈరోజు ఉపవాస దీక్ష పాటించారు.