12 గంటలు…..8 కార్యక్రమాలు

0
52
 
19న మూడు నియోజకవర్గాల్లో సీఎం చంద్రబాబు సుడిగాలి పర్యటన
 
రాజమహేంద్రవరం, నవంబర్‌ 17 : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 19న మూడు నియోజకవర్గాల్లో 12 గంటల పాటు సుడిగాలి పర్యటన జరపనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు డ్వాక్రా సదస్సుకు, పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేయడంతో పాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి 19న ఉదయం 8-50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 9-20కి మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 9-45 గంటలకు సెంట్రల్‌ జైలుకు చేరుకుని ఆధునికీకరించిన జైలు అడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఖైదీల కోసం జైలు ఆవరణలో నిర్మించనున్న ఆసుపత్రి భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఉదయం 10-10 గంటలకు శాటిలైట్‌ సిటీకి చేరుకుని ఉదయం 11-30 వరకు అక్కడ జరిగే జనచైతన్య యాత్రల్లో పాల్గొంటారు. ఆ తర్వాత 11-45 గంటలకు నగరంలోని చెరుకూరి కల్యాణ మండపానికి చేరుకుని పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2-30 గంటలకు మున్సిపల్‌ స్టేడియానికి చేరుకుని సాయంత్రం 4.30 గంటల వరకు అక్కడ జరిగే డ్వాక్రా సదస్సులో పాల్గొంటారు. అక్కడ నుంచి 4-45 గంటలకు ఆర్ట్సు కళాశాల ప్రాంగణానికి చేరుకుని సాయంత్రం 6-30 గంటల వరకు జరిగే దళిత సదస్సులో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు దివాన్‌చెరువులో నగర వనాన్ని ప్రారంభించడంతో పాటు ఏపీ ఫారెస్టు అకాడమీకి శంకస్థాపన చేయనున్నారు. అక్కడ నుంచి ముఖ్యమంత్రి వెలుగుబంద వద్ద ఆదికవి నన్నయ్య విశ్వ విద్యాలయానికి చేరుకుని అక్కడ గ్రంథాలయ భవనాన్ని, హాస్టల్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. రాత్రి 7.30 గంటలకు రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ ఆసుపత్రి అండ్‌ కళాశాలకు చేరుకుని అక్కడ జీఎస్‌ఎల్‌ దంత కళాశాలను ప్రారంభిస్తారు. రాత్రి 8-10 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళతారు.