ఛాయగ్రాహకునిగా, ఆడిటర్‌గా గోదావరి తీరానికి వన్నె తెచ్చిన ద్రోణంరాజు సుందరరామారావు కన్నుమూత

0
268
 ఛాయగ్రాహకునిగా, ఆడిటర్‌గా గోదావరి తీరానికి వన్నె తెచ్చిన
ద్రోణంరాజు సుందరరామారావు కన్నుమూత
పలువురి ప్రముఖుల సంతాపం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 18:  ప్రఖ్యాత ఛాయాగ్రాహకులు, గోదావరి తీరాన తొలి తరం చార్టర్డ్‌  ఎకౌంటెంట్స్‌లో ఒకరుగా ప్రసిద్ధి చెందిన ద్రోణంరాజు సుందర రామారావు గత రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. హృద్రోగ సమస్యతో మూడురోజుల క్రితం ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరిన సుందర రామారావు గత రాత్రి 10.35 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయన పార్ధివ దేహానికి ఈ మధ్యాహ్నం కోటిలింగాలపేట రోటరీ కైలాస భూమిలో అంతిమ సంస్కరణలు జరిగాయి. సుందర రామారావు తండ్రి ద్రోణంరాజు కామేశ్వరరావు కూడా చార్టర్డ్‌ అకౌంటెంట్‌గా రాణించారు. తండ్రి పేరుతో డి.కామేశ్వరరావు అండ్‌ కో చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ సంస్థను స్థాపించిన సుందర రామారావు వృత్తిలో రాణిస్తూ అనతి కాలంలోనే మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ఎందరినో చార్టర్డ్‌ అకౌంటెంట్లుగా తీర్చిదిద్దిన ఆయన వివిధ సంస్ధల అకౌంట్ల పర్యవేక్షణలో సమర్ధవంతునిగా కీర్తి గణించారు. చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ అసోషియేషన్‌ రాజమండ్రి చాప్టర్డ్‌ ప్రెశిడెంట్‌గా పని చేసిన రామారావు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్ర వహించారు. మల్లిగ సత్రం నిర్మాణం, అభివృద్ధిలో, ఉత్తరాది మఠం కార్యకలాపాల్లో చురుకైన పాత్ర పోషించారు. చిత్రకారునిగా కూడ  రాణించిన సుందర రామారావు ఆ రంగంలో లెక్కలేనన్ని అవార్డులు, బహుమతులు అందుకుని గోదావరి తీరం పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేశారు. ఛాయగ్రాహకునిగా ప్రకృతి సౌందర్యాన్ని తన కెమెరాలో బంధించిన సుందర రామారావు మాట కటవుగా ఉన్నట్లు అనిపించినా ఆయన మనస్సు మాత్రం వెన్న లాంటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఛాయగ్రాహకునిగా  ప్రకృతి అందాలనే గాక సజీవ చిత్రాలెన్నింటినో తన కెమెరాలో బంధించిన ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అటు వృత్తిలోనూ, ఇటు ప్రవృత్తిలోనూ కూడా ఎంతో గుర్తింపు పొందిన రామారావు మరణ వార్త తెలియగానే పలువురు ప్రముఖులు దానవాయిపేటలోని ఆయన స్వగృహానికి వెళ్ళి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎమ్మెల్సీ, చైతన్య విద్యా సంస్ధల అధినేత కె.వి.వి.సత్యనారాయణరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, జిఎస్‌ఎల్‌ మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి చైర్మన్‌ డా.గన్ని భాస్కరరావు, ప్రముఖ వైద్యులు డా.వి. త్రినాధరావు, డాక్టర్‌ ఎస్‌.రాజారామ్‌, డా. కంటే వీరన్న చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్తలు జూపూడి పార్ధసారధి, జూపూడి గోపాలకృష్ణ, కోడూరి శాంతారామ్‌, నగరానికి చెందిన ప్రముఖ ఆడిటర్లు వి.శేషగిరి వరప్రసాద్‌, వి.ఎస్‌. ప్రకాశరావు, వి.భాస్కరరామ్‌, రాహుల్‌, కందర్ప కుమార వెంకటేశ్వర్లు, కృష్ణకుమారి, లీలా కృష్ణ, ఫణికుమార్‌, ఏవిఎన్‌ ఫణీంధ్ర, సాయి వెంకటాచలం, పీశపాటి సూర్యనారాయణ శాస్త్రి, గంగాధరరావు తదితరులు సుందర రామారావు భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. వృత్తి పట్ల ఆయన నిబద్ధతను, సామర్ధ్యాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు.
బాబు స్టూడియో అధినేత బాబులు సంతాపం
ద్రోణంరాజు సుందరరామారావు మరణం పట్ల ప్రముఖ ఛాయగ్రాహకులు, బాబూ స్టూడియో అధినేత ముసిని వెంకటేశ్వరరావు (బాబులు) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుందర రామారావుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా బాబులు గుర్తు చేసుకున్నారు. వృత్తి పట్ల నిబద్ధత, ఫోటోగ్రఫీలో ఎంతో ప్రతిభా పాటవాలను చూపిన ఆయన లేని లోటు తీరనిదని పేర్కొన్నారు. వారి కుటుంబానికి  తన సానుభూతి తెలిపారు.