చంద్రబాబు పర్యటనను బహిష్కరించండి

0
311
ప్రజలకు మాజీ ఎంపి హర్షకుమార్‌ పిలుపు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 18 : పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరానికి చేసిన వాగ్ధానాలను అమలు చేయడంలో సీఎం చంద్రబాబునాయుడు పూర్తిగా విఫలమయ్యారని, రేపు నగరంలో జరగబోయే ఆయన పర్యటనను ప్రజలు బహిష్కరించాలని అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్‌ పిలుపు ఇచ్చారు. రాజీవ్‌గాంధీ కళాశాలలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పుష్కరాల తర్వాత సుదీర్ఘ సమయాన్ని సీఎం చంద్రబాబు రేపు నగరానికి కేటాయించారని అన్నారు. పుష్కరాల ప్రారంభంలో  జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోయారని, ఆ ఘటనపై ప్రభుత్వం కమిషన్‌ వేసి చేతులు దులుపుకుందన్నారు. ఇంత ఘోరమైన ఘటన జరిగినా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దళితులకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌పై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  గత రెండేళ్ళగా రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగాయని, అంబేద్కర్‌ విగ్రహాలకు అవమానాలు జరుగుతూనే ఉన్నాయన్నారు.  ‘దళితులుగా పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించిన చంద్రబాబుకు సన్మానం చేయించుకునే అర్హత ఉందా అని ప్రశ్నించారు. కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవులకు సమాధుల నిమిత్తం స్ధలం కేటాయించాలని కోరుతున్నా మొర వినని ప్రభుత్వం విమానాశ్రయ విస్తరణకు మాత్రం వందల కోట్లు కేటాయిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నియమించిన నామినేటెడ్‌ పదవులను హైకోర్టు రద్దు చేయడం ఇదే ప్రథమమని అన్నారు. చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేసిన వారికి మాత్రమే పదవులు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఏనుగుపల్లి రామకృష్ణ, జీవి శ్రీరాజ్‌, పీతల జయబాబు తదితరులు ఉన్నారు.