ఆశయం మంచిదే కానీ…..అమలు విధానమే అసౌకర్యం

0
71
పెద్ద నోట్ల రద్దుపై సీఎం చంద్రబాబు వ్యాఖ్య
రాజమహేంద్రవరం, నవంబర్‌ 19 : పెద్ద నోట్ల రద్దు ఆశయం మంచిదే కాని ఆ తర్వాత సరైన విధానంలో వెళ్ళలేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. శాటిలైట్‌సిటీ గ్రామంలో జన చైతన్య యాత్రలో  మాట్లాడుతూ ధనవంతుల వద్ద మూలుగుతున్న లక్షలాది కోట్ల రూపాయల నల్లధనాన్ని వెలికి తీయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు ఉన్నా వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా ఆసుపత్రిలో చికిత్స, ఇంట్లో శుభ కార్యక్రమాలు వంటి అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు కూడా తగినంత సొమ్ము లభించక పాట్లు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. నల్లధనంతో సమాజాన్ని అవినీతిమయం చేస్తున్న వారి ఆట కట్టించేందుకు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు కూడా కష్టాలు తప్పడం లేదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ. 100, రూ. 50 నోట్లు రావడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, సాధ్యమైనంత త్వరగా ఈ నోట్లను ప్రజల అవసరాలకు అనుగుణంగా విడుదల చేయవలసిందిగా రిజర్వ్‌ బ్యాంక్‌ను కోరినట్లు చెప్పారు. పెద్ద నోట్ల రద్దు సంక్షోభం నుంచి బయటపడేందుకు రాష్ట్ర అవసరాలకు రూ. 10 వేల కోట్లను కేంద్రాన్ని కోరామన్నారు. జన్‌ధన్‌ కార్డుతో పేదలకు సేవలు అందేలా చూస్తామని చంద్రబాబు చెప్పారు.