మిషన్‌ రంధ్రాన్వేషణ

0
88
 గిరీశం యింటరుగు మీద కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు. అలాగని అక్కడేం పెద్ద పెద్ద సమస్యలేం లేవు. ఉదయం ఎప్పుడో రావల్సిన వెంకటేశం యింకా రాలేదంతే. యింతలోనే  వెంకటేశం నెమ్మదిగా దిగాడు. పైగా మనిషి కూడా పది లంఖణాలు చేసినట్టు ఉన్నాడాయె. దాంతో గిరీశం ” ఏవివాయ్‌ వెంకటేశం…. పొద్దుట్నించి  ఏం రాచ కార్యాలు వెలగబెడుతున్నావంట?” అన్నాడు. దాంతో వెంకటేశం కయ్యిమని ” ఆ…మీకన్నీ  అలాగే ఉంటాయ్‌… అవతల రెండు వేల రూపాయలు మార్చడానికి పొద్దుట్నించి ఏటీఎమ్‌ల దగ్గర ప్రదక్షిణాలు  చేసి యిప్పడొస్తున్నా” అన్నాడు. దాంతో గిరీశం నవ్వేసి ‘ ఆ మాత్రం దానికే అంత హైరానా పడిపోతున్నావా…. మరి రేపు  రాజకీయాల్లో ఏం చక్రం తిప్పేస్తావంట? ” అన్నాడు కుర్చీలో సెటిలవుతూ. వెంకటేశం అక్కడే అరుగు మీద సెటిలయి ‘ ఆ చూస్తుండండి… ఎలా చక్రం తిప్పుతానో…అయినా అదేదో మీకు తెలవడానికి ఓ పని చేయనా… నాలుగు రోజుల్లో  ఓ పది లక్షలు కొత్త నోట్లు మార్చి తీసుకొస్తా” అన్నాడు. దాంతో గిరీశం అదిరిపోయి ” పది లక్షలు మార్చడం అంటే పది లక్షలు సంపాదించాడమంత ఈజీ అనుకుంటున్నావా?…కొంప దీసి దొంగనోట్లుగానీ ముద్ర కొట్టేస్తావా?” అన్నాడు. వెంకటేశం కోపంగా ” ఛ…ఛ… అలాంటివి నేనెందుకు చేస్తానంట… ఆ నోట్లేవో రాజమార్గంలో  తెస్తా” అన్నాడు. గిరీశం ఆసక్తిగా అదెలాగన్నట్టు చూశాడు. దాంతో వెంకటేశం చిన్న ఊహలా తనేం చేయబోయేది చెప్పసాగాడు….
                                    ………………                 …………………….                  ………………..
 మూర్తి ఒక్కసారిగా అదిరిపోయాడు. ” రేయ్‌…నువ్వింత పని చేస్తావనుకోలేదురా. అయినా పెళ్ళంటే ఎప్పుడూ తిట్టేవాడివి కదరా” అన్నాడు. దాంతో వెంకటేశం విసుక్కుని ” ఆ…యిదేం నిజం పెళ్ళి కాదురా. ఉత్తుత్తి పెళ్ళంతే… ఓ అరడజను వెడ్డింగ్‌ కార్డులు డీటీపీలో కొట్టివ్వు” అన్నాడు. దాంతో మూర్తి కంగారుపడిపోయి ” అంటే కొంపదీసి ఈ అమ్మాయిని పెళ్ళి చేసుకుని ఏ దుబాయికో అమ్మేస్తావా? ” అన్నాడు. దాంతో  వెంకటేశం విసుక్కుని  ” రేయ్‌….నాకు లేని ఐడియాలు యివ్వకురా…యిదేదో చిన్న డబ్బుల గొడవలే” అన్నాడు. దాంతో మూర్తి యింకేం మాట్లాడకుండా ఆ  వెడ్డింగ్‌ కార్డులేవో డీటీపీలో చేసిచ్చేశాడు.
                                     ………………..                 ………………………               ………………………..
 కలెక్టర్‌ గారి కార్యాలయం….
ఉదయం నుంచి కలెక్టర్‌ గారికీ అసహనంగా ఉంది. ఓ పక్క  నోట్ల మార్పిడి గొడవలూ, యింకో పక్క సీఎం గారి పర్యటన హడావిడీ…. అదీ అసహనానికి కారణం. సరిగ్గా ఆ సమయంలోనే  వెంకటేశం రావడం జరిగింది. వస్తూనే  ” ఈ వారంలో  నా పెళ్ళి సార్‌. పెళ్ళి ఖర్చుల కోసం  రెండున్నర లక్షలు నో ట్ల మార్పిడి చేస్తారని తెలిసింది. మీరు సంతకం పెట్టాలి సార్‌” అంటూ తన చేతిలో వెడ్డింగ్‌ కార్డు యిచ్చాడు. అది చూడగానే  కలెక్టర్‌ అసహనంగా ” అబ్బబ్బ….పొద్దుట్నించీ ఈ పెళ్ళిల గోలేంటీ… యివాళ యిది పన్నెండో కార్డనుకుంటా” అంటూ పీఏని పిలిచి ” యిదిగో… ఈ కార్డులో వివరాలూ, యితరత్రా పేపర్లూ సరిగ్గా ఉన్నాయో లేదో చూసి నా టేబుల్‌ మీద పెడితే సంతకం పెడతా ” అన్నాడు. దాంతో యింక చేసేదేం లేక వెంకటేశం బయట కొంచెం సేపు తిరిగొచ్చాడు. ఆ పాటికీ కలెక్టర్‌గారి సంతకం అయి పోయింది. వెంకటేశం వచ్చాక కలెక్టర్‌ గారు ” అయితే  మా నిడదవోలు అమ్మాయిని  పెళ్ళి చేసుకుంటున్నావన్నమాట” అంటూ తను సంతకం పెట్టిన పేపరు యిచ్చేశాడు. అది… పెళ్ళి ఖర్చుల కోసం రెండున్నర లక్షలు విలువయిన పాత నోట్లు తీసుకుని కొత్త నోట్లు యిమ్మని బ్యాంక్‌లకిచ్చే ఆదేశం. ఆ మర్నాడు వెంకటేశం వెస్ట్‌ గోదావరి కలెక్టర్‌ని  కలిశాడు. అక్కడా అదే తంతు నడిపాడు. అయితే ఈ సారి కార్డులో ఉన్న పెళ్ళికూతురి తరఫున మాట్లాడాడు. ” పెళ్ళి కూతురు సుగుణ నా మేనకోడలులెండి . గ ంగలకుర్రులో ఉండే వెంకటేశం అనే కుర్రాడితో సంబంధం కుదిర్చా.కలెక్టర్‌ ఆ వెడ్డింగ్‌ కార్డూ,యితరత్రా పేపర్లూ పరిశీలించి ” అవునూ… పెళ్ళి కూతురి పేర్న గానీ, వాళ్ళమ్మ పేర్న గానీ బేంక్‌ అకౌంట్‌ లేదా? ఆ వివరాలు యివ్వలేదేం?” అన్నాడు. దాంతో వెంకటేశం ” అబ్బే…వాళ్ళకి అలాంటివేవీలేవు సార్‌… అంతా నేనే చూసుకోవాలి…”  అన్నాడు. దాంతో ఏమనుకున్నాడో కలెక్టర్‌ గారు రెండున్నర లక్షల కొత్త నోట్లు మార్పిడి కోసం బేంకులని ఆదేశిస్తూ ఉత్తరమొకటి సంతకం చేసిచ్చేశాడు.
                                      …………………..                 ……………………………                ………………………..…        ఆ మర్నాడు వెంకటేశం బందరులో ఉన్న తన మేనమూమ కృష్ణశాస్త్రి యింట్లో వాలిపోయాడు. అలా వెళ్ళి వెళ్ళగానే తన పెళ్ళి కార్డు కాస్తా అతగాడి చేతిలో పెట్టేశాడు. యింతకీ అది…. వెంకటేశానికీ, సుగుణకుమారికి జరిగే పెళ్ళి కార్డు. అయితే విశేషమేంటంటే ఆ కార్డేదో కృష్ణశాస్త్రి రాసినట్టుగా కిందపేరుంది. అది చూడగానే కృష్ణశాస్త్రి కళ్ళు ఆనందభాష్పాలు రాల్చాయి. ఆ కన్నీళ్ళు తుడుచుకుంటూ  లోపల వంట గదిలో ఉన్న లలితాంబని పిలిచాడు. ” చూశావుటే… నన్నెవరూ బొత్తిగా పట్టించుకోరనీ, అవసరాల కోసం కరివేపాకులా వాడుకుని వదిలేస్తారనీ దెప్పి పొడుస్తుంటావు కదా. యిదిగో… నా మేనల్లుడు పెళ్ళి కార్డులో  వాళ్ళ అమ్మా నాన్న పేర్లు కూడా కాదని  నా పేరు వేయించాడు” అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ.  ఈ లోగా వెంకటేశం” మావయ్యా….అంత లేదు కానీ…. బేంక్‌లో నోట్లు మార్చుకోవడానికి యిలా ఉత్తుత్తి కార్డులు వేయించాలే. ముందు కలెక్టర్‌గారి దగ్గరికి పద” అన్నాడు. దాంతో లలితాంబ తన పతిదేవుడి వంక ఎప్పుడూ కంటే యింకొంచెం ఎక్కువ పురుగులా చూసి  లోపలికి వెళ్ళిపోయింది. దాంతో కృష్ణ శాస్త్రి మళ్ళీ కిక్కురుమంటేనా…. కొంచెం తేరుకున్న  తర్వాత ” కలెక్టర్‌ గారి దగ్గరకెందుకురా”….అన్నాడు. వెంకటేశం తేలిగ్గా ” మరేం లేదు…. నా మేనల్లుడికి పెళ్ళి చేస్తున్నా”…. బేంకులో నోట్లు మార్చుకోవడానికి లెటర్‌ కావాలని అడగాలంతే” అంటూ  ఏం చేయాలో చెప్పాడు.
                                 ………………………....                      ………………………..……               ………………………….
రెండు రోజుల తర్వాత….
 వెంకటేశం రైల్వే రిజర్వేషన్‌   క్యూలో ఉన్నాడు.  ఆలోచనలు మాత్రం గత మూడు రోజులుగా బేంకుల్లో మార్చుకున్న నోట్ల గురించే .  అదేదో ఏడున్నర లక్షల దాక ఉంటుంది. యింకో రెండున్నర లక్షలూ చేసేస్తే అదేదో పది లక్షలయిపోతుందని అనుకున్నాడు. ఈలోగా తన వంతు వచ్చేసరికి తను పూర్తి చేసిన ఫారాలేవో లోపలికిచ్చాడు. లోపల క్లర్క్‌ అది చూసి  ‘ రాజమండ్రీ నుంచి ఢిల్లీకి రానూపోనూ ఏసీ ఫస్ట్‌ క్లాస్‌’  అంటూ  కంప్యూటర్‌లో చూసి ” రానూపోనూ ఈ పన్నెండూ టిక్కెట్లకి లక్షా నలభై ఒక్క వేల దాకా అవుతుంది.” అన్నాడు. వెంకటేశం ఆ మొత్తమేదో పాతనోట్లు ఇచ్చేశాడు.  తర్వాత గోదావరి స్టేషన్‌కు వెళ్ళి ముంబాయికీ కూడా అలాగే రానుపోనూ టిక్కెట్లు తీసేశాడు. అదీ  దాదాపు అంతే అయింది. మళ్ళీ సాయంత్రం ఆ రెండు చోట్లకీ వెళ్ళి మొత్తం టిక్కెట్లు కేన్సిల్‌ చేసేసి వాళ్ళిచ్చిన కొత్త నోట్లు పుచ్చుకుని చక్కా వచ్చేశాడు. ఛార్జ్‌లవీ ఓ రెండువేల దాకా పోయిందంతే….!
                                     ………………………..……..                        ………………………..….                 ……………………
” అది గురూగారు చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం అదిరిపోయి ” నువ్వు అసాధ్యుడివోయ్‌… యిసుకలోంచి కూడా తైలం తీసేస్తావనిపిస్తుంది. యిక రాజకీయాల్లోకి వెళితే దున్నేయెచ్చు” అంటుంటే టీవీలో వార్త చెపుతున్నారు. రైల్వే టిక్కెట్లకి క్యాష్‌ రిఫండ్స్‌ ఉండవనీ, పెళ్ళిళ్ళికు కల్యాణమండపం బుక్‌ చేసిన రసీదు సబ్మిట్‌ చెయ్యాలనీ” ఇద్దరూ అవాక్కయ్యారు.
                                                                                                                    డాక్టర్‌ కర్రి రామారెడ్డి