జగన్‌ అరెస్టు కోరుతూ ఢిల్లీలో దీక్ష 

0
63
దళిత, గిరిజనులపై వైకాపా అధినేతకు కపట ప్రేమ
ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ
రాజమహేంద్రవరం, నవంబర్‌ 21  : ఆర్థిక నేరస్తుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ ఢిల్లీలో తాను దీక్ష చేస్తానని  రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ కారెం శివాజీ వెల్లడించారు. లాలాచెరువు వద్ద దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను లక్ష్యంగా చేసుకుని జగన్‌ కక్ష సాధించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.  తాను  తలబెట్టినా దళిత, గిరిజన మహా గర్జనకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని, అవినీతి సొమ్ముతో జగన్‌ నిర్వహిస్తున్న పత్రికలో ఒక ముక్క కూడా రాయకపోవడం చూస్తే దళితులపై ఆయనకున్న కపటి ప్రేమ బహిర్గతమైందన్నారు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్ముతో సమాజాన్ని పాలించాలని ప్రయత్నిస్తున్న వైఎస్‌ జగన్‌ను తాను వదిలిపెట్టబోనని శివాజీ హెచ్చరించారు. తన సభకు దళితులు వెళ్ళకూడదని  మాజీ ఎంపి హర్షకుమార్‌ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు.  దళిత వ్యతిరేకి అయిన హర్షకుమార్‌ను దళిత గిరిజనులు బహిష్కరించాలని పిలుపు ఇచ్చారు. ఆయన చర్యల వల్ల యానంలోని రీజెన్సీ పరిశ్రమ మూతపడి వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని అన్నారు. ఆయన వెనుక తిరిగి ఉద్యమాల్లో పాల్గొన్న దళితులపై కేసులు నమోదు చేశారని, కొంతమందిపై రౌడీషీటు తెరిచారని పేర్కొన్నారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత గిరిజన మహాగర్జన సభను విజయవంతం చేశారని అన్నారు. తాను ఎప్పడూ చిత్తశుద్ధినే నమ్ముకుంటానని, అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌, ఫూలే వంటి మహానీయులు చూపిన బాటలో పయనిస్తున్నానని చెప్పారు. తాను నిర్వహించిన మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందని, దళిత గిరిజనులను ఎస్టీలుగా గుర్తిస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తి, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్‌ నిర్మాణానికి సీఎం అంగీకరించారని తెలిపారు. గర్జనకు విచ్చేసిన సీఎంకు , ఉప ముఖ్యమంత్రి రాజప్పకు, ఎమ్మెల్యేలకు దళిత గిరిజనుల్లోని అన్ని వర్గాల వారికి శివాజీ కృతజ్ఞతలు తెలిపారు.మాల మాహానాడు  జాతీయ అధ్యక్షులు ధనరాశి శ్యామ్‌సుందర్‌, నాయకులు యు.రాజారావు, తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి, తుమ్మల తాతారావు, తురకల నిర్మల, ఎల్‌.వి.ప్రసాద్‌, రెల్లికుల సంఘ నాయకులు నీలాపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ  ఈ మహాగర్జనను అడ్డుకోవడానికి చాలా మంది ప్రయత్నించినా కారెం శివాజీపై ఉన్న అభిమానంతో, ఎస్సీఎస్టీ కమిషన్‌ చైర్మన్‌గా ఆయన చేసిన కృషిని దృష్టిలో పెట్టుకుని భారీగా తరలి వచ్చారని అన్నారు. మహాగర్జనను విజయవంతం చేయడంలో అజ్జరపు వాసు చేసిన కృషి మరువలేమని, అన్ని సంఘాలను సంఘటితపర్చి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్త వహించారని కొనియాడారు. ఈ సందర్భంగా కారెం శివాజీని పలు దళిత సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొచ్చా రమణ, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగుకుమారి, విజ్జిన మధు, గారా చంటిబాబు, సుజాత పాల్గొన్నారు.