చదువు కాదు.. స్కిల్‌ ఉంటేనే  ఉద్యోగం

0
85
ప్రైవేటు కళాశాలల్లో  ఆ దిశగా చర్యలు
రాజమహేంద్రవరం, నవంబర్‌ 22 : బండగా చదువుకుంటూ పోతే ఫలితం లేని ఈరోజుల్లో ప్రతి విద్యార్ధికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ (వ్యక్తిత్వ వికాశం) అత్యంత అవశ్యమని గుర్తించిన పలు కళాశాలల యాజమాన్యాలు తమ విద్యార్ధులను ఆ దిశగా నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఉన్న జవహర్‌ నాలెడ్జ్‌  సెంటర్లను చాలా ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు కూడా అందిపుచ్చుకుని తమ విద్యార్ధులకు డిగ్రీ స్థాయిలోనే ప్లేస్‌మెంట్‌ వచ్చేలా కృషి చేస్తున్నాయి. అందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన ఏపీ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారంతో  తమ విద్యార్ధులను ఉద్యోగాలకు అవసరమైన రీతిలో మలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.  ఈ మేరకు  ఉభయ గోదావరి జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల గూగుల్‌ గ్రూప్‌లో రాజమహేంద్రి మహిళా డిగ్రీ, పీజీ, జూనియర్‌ కళాశాల కూడా చేరింది. ఇప్పటికే 60 శాతం మార్కులు దాటిన డిగ్రీ ఆఖరి సంవత్సరం విద్యార్ధులను ఎంపిక చేసి వారికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇస్తున్నాయి. ఈ  నేపధ్యాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి కళాశాలలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల  సమావేశంలో కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ టి.కె. విశ్వేశ్వరరెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణకు సంబంధించి ఉభ య గోదావరి జిల్లాల ఇన్‌ఛార్జి కృష్ణారెడ్డి, నన్నయ యూనివర్శిటీ ప్రతినిధి జగన్మోహనరెడ్డి మాట్లాడారు. తొలుత విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ 60 శాతం మార్కులు దాటి వచ్చిన వారిని గుర్తించి వారికి తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు ఎంపికయ్యేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సహకారం తీసుకుంట్నుట్లు తెలిపారు.  రాజమహేంద్రి కళాశాలలో 129 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కృష్ణారెడ్డి  మాట్లాడుతూ ప్లేస్‌మెంట్‌ నిమిత్తం కళాశాలలకు వచ్చే కంపెనీలకు ఇంటర్వ్యూలకు ఎలా సంసిద్ధులు కావాలి, విద్యార్ధులు వ్యక్తిత్వ వికాశాన్ని, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను ఎలా పెంపొందించుకోవాలి? తదితర అంశాలపై ఉభయ గోదావరి జిల్లాల్లో ఎంపిక చేసిన 23  కళాశాలల్లో 1600 మంది విద్యార్ధులకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.  ఈ శిక్షణ పొందిన వారి కోసం ప్రతి నియోజకవర్గంలో  ఒక జాబ్‌ మేళాను నిర్వహించేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. విశాఖలో త్వరలో ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీల ఇంటర్వ్యూలకు వీరిని సంసిద్ధులను చేస్తున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్‌ నాళం రజనీ,కళాశాల కంప్యూటర్స్‌ విభాగం హెడ్‌ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.