నగరానికి రేపు కంచి కామకోటి పీఠాధీశుల రాక

0
54
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 : కంచి కామకోటి పీఠాధీశులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి, శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి రేపు నగరానికి వేంచేస్తున్నారు. మూడురోజులపాటు వారు నగరంలోనే విడిది చేస్తారు. దానవాయిపేటలోని ప్రముఖ ఆడిటర్‌ వి.భాస్కరరామ్‌ ఇంట్లో స్వామీజీల విడిది కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా దానవాయిపేట గ్రీన్‌ పార్కు రెస్టారెంట్‌ ఎదురుగా ఉన్న హోతా వారి శివా టవర్స్‌ ప్రాంగణంలో కంచి స్వాముల ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం సంప్రదాయ పద్ధతిలో పందిళ్ళు వేశారు. ఈ మూడు రోజులు తెల్లవారుజామున 5 గంటలకు ప్రభాత దర్శనంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీ మహాత్రిపుర సుందరీ దేవి, శ్రీ చంద్రమౌళీశ్వరస్వామివారి పూజ, అనుగ్రహ భాషణం, తీర్థ ప్రసాద వితరణ జరుగుతాయి. సాయంత్రం 5 గంటల నుండి పండిత ప్రవచనాలు, స్వామివారి అనుగ్రహభాషణం, 7 గంటలకు పూజ, నీరాజన క్రతువులు నిర్వహిస్తారు. పాద పూజలు, బిక్షావందనం వంటి విశిష్ట సేవలకు శివా టవర్స్‌ ప్రాంగణంలోని కంచి పీఠం అధికారులను సంప్రదించవచ్చు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరలించాలని ఆహ్వాన కమిటీ కన్వీనర్‌ వి.భాస్కరరామ్‌ కోరారు.