ప్రజాప్రతినిధులకు ‘క్రమశిక్షణ నియమావళి’ ఉండాలి

0
130
సుప్రీంకోర్టులో లోక్‌సత్తా రాజగోపాల్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం
రాజమహేంద్రవరం, నవంబర్‌ 24 : ప్రధానితో సహా ప్రజాప్రతినిధులందరికీ క్రమశిక్షణా నియమావళి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన క్రమశిక్షణా సంఘం ఉండాలని లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర కన్వీనర్‌ ఎం.వి.రాజగోపాల్‌ అన్నారు. ఈ విజ్ఞతతో త్వరలోనే సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని తెలిపారు. ఎ.వి.అప్పారావురోడ్‌లోని లోక్‌సత్తా కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మనదేశంలో రెండు రకాల పబ్లిక్‌ సర్వెంట్‌లు ఉన్నారని, ఒకరు ప్రజాప్రతినిధులు కాగా మరొరు ప్రభుత్వాధికారులు, ఉద్యోగులు అని అన్నారు. ప్రభుత్వాధికారులు, ఉద్యోగులకు పరిమితమైన విధులు, అధికారాలు ఉన్నాయని, వారికి ఉద్యోగ నియమావళి, క్రమశిక్షణా నియమావళి కూడా ఉందన్నారు. అయితే ప్రజాప్రతినిధులకు లేకపోవడం వల్ల జవాబుదారీతనం కొరవడిందని, పార్టీ రక్షణ ఉన్నంతవరకు ఎన్ని తప్పులు చేసినా ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారన్నారు. ఇటువంటి వైఫల్యాలను విచారించడం కోసం త్వరలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని స్వయంగా దాఖలు చేసి కేసు వాదిస్తానని పేర్కొన్నారు. పాత నోట్ల రద్దు సందర్భంగా దాచుకున్న సొమ్మును తీసుకోవడానికి పరిమితులు పెట్టడం చట్టవిరుద్ధమని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. విలేకరుల సమావేశంలో జార్జి ప్రసాద్‌, వర్మ, మెండా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.