కాంగ్రెస్‌కు దుర్గేష్‌ గుడ్‌బై ?

0
628
భవిష్యత్‌ నిర్ణయంపై అనుచరులతో మంతనాలు
త్వరలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరిక
రాజమహేంద్రవరం, నవంబర్‌ 25 : కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. కాంగ్రెస్‌ జిల్లా  సారధిగా ఉన్న మాజీ శాసనమండలి సభ్యులు  కందుల దుర్గేష్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు తన ముఖ్య అనుచరులతో దుర్గేష్‌ అంతరంగిక చర్చలు జరిపినట్లు తెలిసింది.  గత సార్వత్రిక ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసిన దుర్గేష్‌ ఆ తర్వాత జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాగే ప్రత్యేక హోదా, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తదితర అంశాలపై పార్టీ తరఫున ఎన్నో పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.  ప్రత్యేక హోదాపై కోటి సంతకాల సేకరణ, విద్యార్ధి, యువజన బ్యాలట్‌, మట్టి సత్యాగ్రహం, ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన దుర్గేష్‌ జిల్లాలో పార్టీ పునర్జీవానికి ఎంతో కృషి చేశారు. రాష్ట్రంలో ఇప్పట్లో కాంగ్రెస్‌కు భవిష్యత్‌ కనిపించకపోవడం, చెల్లా చెదురైన క్యాడర్‌ను సమీకరించడం అసాధ్యంగా మారడం, కొత్త క్యాడర్‌ను పార్టీ వైపు ఆకర్షించడం కూడా సాధ్యం కాదనే భావనతో ప్రస్తుతం అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీకి ధీటైన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయే ఆలోచనతో ఆయన ఆ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగితే తమకు రాజకీయ భవిష్యత్‌ ఉండదనే ఆలోచనలో ఉన్న చాలా మంది నేతల, అభిమానుల ఆలోచనకు అనుగుణంగా ఆయన కాంగ్రెస్‌ను వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో దుర్గేష్‌ తన నిర్ణయాన్ని బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయమై ఇప్పటికే ఆయన పార్లమెంట్‌ నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుచరులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. దుర్గేష్‌ వెంట జిల్లాలో  ముఖ్యంగా ఆయన కార్యస్థానమైన రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో కొద్దో గొప్పొ మిగిలి ఉన్న ముఖ్య కాంగ్రెస్‌ నేతలు కూడా వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.