4న మూల్‌నివాసీ సంఘ్‌ రాష్ట్ర సదస్సు 

0
77
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 2 : ఫూలే అంబేద్కర్‌ సిద్ధాంత భూమిక ప్రాతిపదికగా సమూలమైన మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న మూల్‌ నివాసీ సంఘ్‌  మొట్టమొదటి రాష్ట్ర సదస్సును ఈ నెల 4న ఉదయం 9 గంటలకు శ్రీ వెంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు ఆ  సంఘ్‌ నాయకులు నయనాల కృష్ణారావు, బిసి సంక్షేమ సంఘం జెఏసీ రాష్ట్ర కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు వారు విలేకరులతో మాట్లాడుతూ  బహుజన సమాజానికి చెందిన కఠిన సమస్యల పట్ల విశ్లేషించడం, వాటిని  పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. 4న జరిగే రాష్ట్ర సదస్సులో విశేష అంశాలను విజ్ఞానవంతులైన మేథావుల మధ్య చర్చిస్తామన్నారు. ఈ సదస్సుకు దక్షిణ మధ్య రైల్వే విశ్రాంత చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏ. భరత్‌ భూషణ్‌, కర్నూలు జాయింట్‌ కలెక్టర్‌ సి.హరికిరణ్‌, బొల్లినేని హాస్పటల్స్‌ సిఇఓ డా.ఎన్‌.ఎస్‌.రామరాజు, మూల్‌ నివాసీ సంఘ్‌ జాతీయ అధ్యక్షులు కుర్మీ హేమరాజ్‌సింగ్‌ పటేల్‌ హాజరవుతారన్నారు. ఈ సదస్సులో ముందుగా తొమ్మిది గంటల నుంచి   10-30 గంటల వరకు మూల్‌ నివాసీ బహుజన చైతన్య గీతాలు, ప్రత్యేక నాటకాలు ఉంటాయన్నారు. 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సదస్సు జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి   ” ఓబిసి, ఎస్సీ,  ఎస్టీలు ఒకే రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు” అనే అంశం పై చైతన్యపూరిత సమావేశం ఉంటుందని, నయనాల కృష్ణారావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో  రీసెర్చ్‌ డిజైన్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ ఆర్గనైజేషన్‌ డైరక్టర్‌ ఆర్‌. శ్రీనివాస్‌, డిఎస్సీ మేకా సత్తిబాబు, పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం డీన్‌  డా. ఎండ్లూరి సుధాకర్‌ పాల్గొంటారని తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు సింధూర కల్చరల్‌ అసోషియేషన్‌ ఒంగోలు వారి  మహత్మా జ్యోతిరావు ఫూలే నాటక ప్రదర్శన ఉంటుందని, డా. డి.విజయ్‌భాస్కర్‌ ఈ నాటకాన్ని రచించగా పాటిబండ్ల ఆనందరావు దర్శకత్వం వహించారని తెలిపారు.  మూల్‌ నివాసీ సమాజంలోని మేథావులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, విద్యార్ధులు విరివిగా పాల్గొనాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుడుపూడి పార్ధసారధి, మార్గాని చంటిబాబు, కెకె సంజీవరావు, వైరాల అప్పారావు, మార్గాని రామకృష్ణాగౌడ్‌, కొంకి రమేష్‌,  తాళ్ళూరి బాబూ రాజేంద్రప్రసాద్‌, కోరుకొండ చిరంజీవి,  ఇమంది కన్నారావు, సిరిమళ్ళ అమృత ప్రసాద్‌,చొప్పల మోహన్‌, రాఘవేంద్ర యాదవ్‌, వేముల చిన్నయ్య, నెల్లి సత్యకిరణ్‌, రమణ పాల్గొన్నారు.