న్యాయవాదుల కృషి ఫలితమే కొత్త కోర్టులు

0
82
బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పిఏ చౌదరి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 5 : న్యాయవాదుల సమిష్టి కృషి  ఫలితమే మహిళా కోర్టు, ఏసిబి కోర్టును ఏర్పాటు చేయగలిగామని, ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  స్పందించిన తీరుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాజమండ్రి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పి.ఏ.చౌదరి తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ హాలులో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఏసిబి కోర్టును ఏర్పాటు చేయడానికి అందరూ సమిష్టిగా కృషిచేశారని, గత పాలకుల సైతం ఏర్పాటుకు సహకరించారని తెలిపారు. కక్షిదారులు కోర్టుకు హాజరయ్యేందుకు విజయవాడ వెళ్ళాల్సి వస్తోందని, ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నారని గుర్తించి ఈ ప్రతిపాదన తెరపైకి తేవడం జరిగిందన్నారు. 2008లో అప్పటి హైకోర్టు న్యాయమూర్తి కె.సి.భాను ప్రోత్సాహంతో ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. గతనెల 19న నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడును కలిసి ఏసిబి కోర్టు ఆవశ్యకతను వివరించామని ఆయన సానుకూలంగా స్పందించి ఈనెల 2వ తేదీన రాజమండ్రిలో ఏసిబి కోర్టును ఏర్పాటు చేస్తూ జిఓ విడుదల చేశారని తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు, ఉప ముఖ్యమంత్రి రాజప్ప, ఎం.పి. మురళీమోహన్‌, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆకుల సత్యనారాయణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు వి.వి.వి.చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి అప్పారావు, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ, న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరితగతిన కోర్టు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కార్యదర్శి ఎ.వి.ఎన్‌.ఎస్‌.రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఏడాదిలోనే మహిళా కోర్టు, ఏసిబి కోర్టును ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం ఉందన్నారు. గత ఎనిమిదేళ్ళ నుంచి చేస్తున్న కృషి ఫలించిందని చెప్పారు. పూర్వాధ్యక్షులు దివాకర్‌ మాట్లాడుతూ అనేకమంది చేసిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయన్నారు. ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఏసిబి కోర్టును ఏర్పాటు చేయాలని హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం వల్ల ప్రభుత్వం చొరవ చూపిందన్నారు. ఇప్పటికే ఏసిబికి సంబంధించిన 70 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అవి ఈ ప్రాంతానికి చెందినవన్నారు. గతంలో కంప్యూటర్‌ లైబ్రరీ ఏర్పాటుకు రూ.7.50 లక్షలు మంజూరు చేయించడంలోనూ, ఇప్పుడు ఏసిబి కోర్టుకు సంబంధించిన జిఓ రప్పించడంలోనూ రూరల్‌  ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చేసిన కృషి మరువలేమన్నారు. త్వరితగతిన న్యాయమూర్తులను కూడా నియమించాలని ముప్పాళ్ళ కోరారు. తవ్వల వీరేంద్రనాధ్‌ మాట్లాడుతూ ఏసిబి కోర్టు ఏర్పాటుకు సంబంధించి తొలుతగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఫైలుపై తొలి సంతకం చేశారని, బార్‌ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న అప్పటి ఎం.పి. ఉండవల్లి అరుణ్‌కుమార్‌, అప్పటి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులు చొరవ తీసుకున్నారని తెలిపారు. అప్పటి హైకోర్టు న్యాయమూర్తి కె.సి.భాను, లా సెక్రటరీ శివశంకర్‌ చూపిన చొరవ, ప్రోత్సాహం వల్లే సఫలీకృతులమయ్యామన్నారు. పూర్వాధ్యక్షులు సిహెచ్‌.ప్రసాద్‌ కృషి అభినందనీయమని గుర్తు చేశారు. ప్రస్తుత కమిటీ కూడా పట్టు వదలకుండా నిరంతరం కృషిచేశారని అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి శంభూప్రసాద్‌,  ప్రేమ్‌కుమార్‌, ఎన్‌.శ్రీనివాస్‌, దాసరి అమ్ములు, ఎన్‌.డి.ఎం.శిష్ఠి, ప్రసాద్‌, ఆంజనేయబాబు, వెంకట్రావు, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.