మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం నిరంకుశత్వం 

0
79
గిరిజన ప్రజల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి : సిపిఎం అరుణ్‌
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 6 : నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో మాస్టర్‌ ప్లాన్‌ ఆమోదం ఏకపక్షంగా జరిగిందని, ఇది నిరంకుశత్వమని సీపీఎం నాయకులు టి.అరుణ్‌ అన్నారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌లో 13 గ్రామాలను విలీనం చేశారని, అలాంటప్పుడు ఆ పదమూడు గ్రామాల్లో మాస్టర్‌ ప్లాన్‌పై గ్రామ సభలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. నగరానికి చెందిన నాయకులు రూరల్‌ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు సలహాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమోదించారని, తక్షణమే మాస్టర్‌ ప్లాన్‌పై అఖిలపక్షం వేయాలని, 13 విలీన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన సమస్యలపై 25 రోజులు పాదయాత్ర చేపట్టామని, దీనివల్ల అనేక సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని, తక్షణమే వారి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చెప్పాలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులపై భారం పడిందని, 130 కోట్ల దేశ జనాభాలో ఒక శాతం మంది మాత్రమే నగదు రహిత లావాదేవీలు జరుపుతున్నట్లు ఆర్‌బిఐ ప్రకటించిందని, మోడీ చర్య పచ్చి బూటకమన్నారు. అపరాధ రుసుము చెల్లించలేదని చెత్త వేయించిన కమిషనర్‌ మొండి బకాయిలు వున్న వ్యక్తుల ఇళ్ళ ముందు చెత్త వేయగలరా అని సవాల్‌ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎస్‌.ఎస్‌.మూర్తి, బి.బి.నాయుడు, భీమేశ్వరరావు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.