10న ఇన్నీసుపేట బ్యాంక్‌ నూతన భవనం ప్రారంభోత్సవం 

0
55
త్వరలో రెండు బ్రాంచీల ఏర్పాటు – 2018లో శతాబ్ధి ఉత్సవాలకు సన్నాహాలు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 8 : శ్యామలా సెంటర్‌లో నిర్మించిన  ది ఇన్నీసుపేట కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ నూతన ప్రధాన కార్యాలయ భవనాన్ని ఈనెల 10వ తేదీన మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభిస్తున్నామని, శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి, శ్రీశ్రీశ్రీ త్రిదిండి దేవనాధ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆ బ్యాంక్‌ చైర్మన్‌ కోళ్ళ అచ్యుత రామారావు (బాబు) తెలిపారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1918లో పాలకోడేటి గురుమూర్తి ఉన్నత ఆశయాలతో ఇన్నీసుపేట అర్బన్‌ బ్యాంక్‌ను స్ధాపించారని, 2018లో ఈ బ్యాంక్‌ వందేళ్ళు పూర్తి చేసుకుంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అత్యుత్తమ సేవలను అందిస్తూ బ్యాంక్‌ను అన్ని విధాలుగా పరిపుష్టం చేస్తున్నామన్నారు. 2001లో  తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన తరువాత బ్యాంక్‌ కార్యకలాపాల్లో అనూహ్యమైన మార్పులు తీసుకువచ్చామని, జాతీయ బ్యాంక్‌లకు ధీటుగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బ్యాంక్‌ను చేరువ చేశామన్నారు. 2001లో రూ.15.44 కోట్ల డిపాజిట్లు ఉండేవని, ప్రస్తుతం 67.52 కోట్లకు చేర్చగలిగామన్నారు. 2001లో రూ.15.61 కోట్ల రుణాలను అందించగా ప్రస్తుతం రూ.36.86 కోట్ల రుణాలను అందించామన్నారు. 2001లో 6,669 మంది మెంబర్లు ఉండేవారని, ప్రస్తుతం 9,833 మంది మెంబర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. 2001లో బ్యాంక్‌ షేర్లు రూ.81 లక్షలు కాగా, ఈ ఏడాది ప్రస్తుతానికి రూ.2.51 కోట్లకు చేర్చామన్నారు. తమ పాలకవర్గం హయాంలోనే 2010లో తిలక్‌రోడ్‌లో నూతన బ్రాంచిని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే మరో రెండు కొత్త బ్రాంచీలను ఏర్పాటు చేసేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి కోరామన్నారు. 2018 నాటికి బ్యాంక్‌ స్థాపించి వందేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా శతాబ్ధి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తమ పాలకవర్గం సన్నాహాలు చేస్తోందన్నారు. అతి తక్కువ వడ్డీకి రుణాలు, నూతన లాకర్ల సదుపాయం, డిడి, చెక్‌ సదుపాయాలు, అతి తక్కువ సమయంలో బంగారంపై రుణాలు, ప్రమాదంలో మరణించిన ఖాతాదారుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, కోర్‌ బ్యాంకింగ్‌ సిస్టమ్‌ ద్వారా విస్తృత సేవలు తమ బ్యాంక్‌ ప్రత్యేక సేవలన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సహకార బ్యాంకులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని, ఖాతాదారుల ఆగ్రహాలకు తాము గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంక్‌లో దాచుకున్న డబ్బును తీసుకోవడానికి కూడా గంటల కొద్దీ సమయం వెచ్చించడం, రోజుకు రూ.2వేలు మాత్రమే అందించడంపై ఖాతాదారుల్లో తీవ్ర ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 10న జరగబోయే ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధులు, నగర ప్రముఖులు, సహకార శాఖ అధికారులు, బ్యాంక్‌ పూర్వాధ్యక్షులు పాల్గొంటారని తెలిపారు. విలేకరుల సమావేశంలో బ్యాంక్‌ వైస్‌ చైర్మన్‌ బొంతు వీర వెంకట సత్యనారాయణ, కరగాని వెంకట రమణారావు, కేతా వెంకటస్వామి, పిల్లి వీర వెంకట రమణ, పొడిపిరెడ్డి శ్రీనివాసరావు, పంచికట్ల శివప్రసాద్‌, మాకిరెడ్డి నారాయణరావు, రెడ్డి సూర్యచంద్రరావు, సూర్రెడ్డి రమేష్‌, బ్యాంక్‌ సెక్రటరీ రెడ్డి సూర్య సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.