చంద్రబాబు పాత్రపై విచారణ అక్కర్లేదు

0
55
ఓటుకు నోటు కేసులో హైకోర్టు తీర్పు – సుప్రీంలో సవాలు చేస్తానన్న వైకాపా ఎమ్మెల్యే
హైదరాబాద్‌, డిసెంబర్‌ 9 : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో తన పాత్రపై విచారణ జరపాలని  ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాది హైకోర్టులో క్వాష్‌ పిటీషన్‌ దాఖలు చేయగా చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని హైకోర్టు ఈరోజు తీర్పు చెబుతూ ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్ని కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలంటూ ఇటీవల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ళ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా దీనిపై హైకోర్టుకు వెళ్ళాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానం పిటీషనర్‌కు సూచించింది. ఒకవేళ హైకోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే అప్పుడు తిరిగి సుప్రీంకోర్టుకు రావలసిందిగా తెలిపింది. దీంతో పిటీషనర్‌ హైకోర్టును ఆశ్రయించగా విచారణ అనంతరం ఈరోజు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని హైకోర్టు తీర్పు నిచ్చింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. కాగా ఈ తీర్పు వెలువడ్డాక ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కోర్టు న్యాయస్ధానం ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ తాను చంద్రబాబును వదిలి పెట్టే ప్రసక్తి లేదని, దీనిపై తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఈ విషయమై తనకు సుప్రీంకోర్టు గతంలోనే అవకాశం ఇచ్చిందని, హైకోర్టులో న్యాయం జరగలేదని భావిస్తే తమ వద్దకు రావలసిందిగా సుప్రీంకోర్టు గతంలోనే తనకు అవకాశం ఇచ్చిందని,తాను సుప్రీంను ఆశ్రయిస్తానని రామకృష్ణారెడ్డి తెలిపారు.