పెనం నుంచి పొయ్యిలోకి…

0
180

పెనం నుంచి పొయ్యిలోకి…
(శనివారం నవీనమ్)

పెద్దనోట్లను రద్దు చేయడం ద్వారా ప్రజల్ని ఉద్దరించడానికి ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న చర్య వల్ల నెలరోజులుగా ప్రజల జీవితం అతలాకుతలమైపోయింది…పెనం మీది నుంచి పొయ్యిలోకి…కోతిపుండు బ్రహ్మరాక్షసి అయ్యింది…కొండ నాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడింది…ఈ సామెతలన్నీ నెలరోజులుగా భారతప్రజానీకానికి అనుభవమౌతున్నాయి.

పెద్ద నోట్ల రద్దు తరువాత ఇప్పటి వరకు రూ.11.55 లక్షల కోట్ల పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్‌ అయినట్లు ఆర్‌బిఐ గవర్నర్‌ చెప్పారు. మరో రూ.3.5 లక్షల కోట్లు డిపాజిట్టయితే, చలామణిలో ఉన్న పాత నోట్లన్నీ బ్యాంకులకు చేరినట్లే! డిపాజిట్లకు ఇంకా 20 రోజుల గడువు ఉండటంతో ఆ మొత్తం కూడా దాదాపుగా బ్యాంకులకు చేరే అవకాశమే ఉంది. అదే జరిగతే నల్లధనంపై యుద్ధమన్న ప్రధాని ప్రకటన నిజం కాదని తేలిపోయినట్టే! డిపాజిట్‌ అయిన నోట్ల స్థానంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లనే ఆర్‌బిఐ ముద్రించింది. రద్దయిన నోట్ల పూర్తి మొత్తానికి కొత్తనోట్లు ముద్రించేది లేదని ఆర్ధిక మంత్రి స్పష్టం చేసేశారు. దీని అర్థం రానున్న రోజుల్లోనూ నోట్ల కష్టాలు తప్పవనే! దీనిని దృష్టిలో ఉంచుకునే డిపాజిట్లపై పరిమితులను తొలగించడానికి ఆర్‌బిఐ సిద్ధ పడలేదు. కొత్త నోట్లనూ దాచుకోవద్దని ఆర్‌బిఐ గవర్నర్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో వ్యవస్థలపై నమ్మకం కోల్పోతున్న ప్రజలు ఈ పిలుపునకు సానుకూలంగా స్పందించే పరిస్ధితి లేదు!

రానున్న రోజులు మరింత గడ్డుగా మారనున్నాయని, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకనున్నాయని, నిరుద్యోగం పెరగనుందని, అన్ని రంగాల్లోనూ దేశం వెనకబాటు తప్పదన్న సూచనలు రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షా సమావేశం సూచించింది. పరపతి విధాన సమీక్ష కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బిఐ నిర్వహించిన అయిదో సమావేశం ఇది. పెద్దనోట్ల రద్దు తరువాత జరిగిన మొదటి సమావేశం ఇది.

ఈ ఆర్థిక సంవత్సరంలో 7.6 నుండి 7.1 శాతానికి వృద్ధి రేటు తగ్గనుందని ఆర్‌బిఐ పేర్కొంది. అయితే, ఈ అంచనా కూడా వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్థిక రంగ నిపుణుల అంచనాలు మరింత ఆందోళనకరంగా ఉన్నాయి. వారు చెబుతున్న సమాచారం ప్రకారం 6.5 శాతానికి వృద్ధి రేటు పడిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే పరిస్థితులు మరింత క్లిష్టంగా మారడం ఖాయం.

పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల నగదు నిల్వల నిష్పత్తి గణనీయంగా పెరిగి, రుణాలు ఇవ్వడానికి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులోకి వస్తాయని, వడ్డీ రేట్లు తగ్గుతాయని, ఫలితంగా వృద్ధి రేటు పరుగులు తీస్తుందని పార్లమెంటు బయట ప్రధాని పదే పదే ఊదరగొట్టారు. ఆయన మాటలతో కనీసం 25 బేసిక్‌ పాయింట్ల మేర వడ్డీ పాయింట్లు తగ్గుతాయని పలు కార్పొరేట్‌ సంస్థలు అంచనా వేశాయి. అయితే, ఆర్‌బిఐ దానికి భిన్నంగా స్పందించడం నోట్ల రద్దు వ్యవహారంలోని సంక్లిష్టతకు అద్దం పడుతోంది. ఒక్క బేసిక్‌ పాయింట్‌ కూడా తగ్గించడానికి ఆర్‌బిఐ సిద్ధ పడలేదు.

ఈ ప్రభావం మార్కెట్లపై పడింది. సెన్సెక్స్‌ నష్టాల బాట పట్టింది. నగదు కొరత వెంటాడుతుండటం, విత్‌ డ్రాయిల్స్‌పై పరిమితిని ఎత్తివేయక పోవడం వంటి చర్యలు కూడా మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.నోట్ల రద్దు తరువాత నగదు నిల్వల నిష్పత్తిని నూరు శాతం పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తాజా సమావేశంలో రిజర్వు బ్యాంకు వెనక్కి తీసుకున్నప్పటికీ, దాని వల్ల ఫలితం అంతంత మాత్రమే! నిత్యావసర ధరల అదుపు దిశలో ఎటువంటి చర్యలూ ప్రకటించక పోవడం సామాన్యునికి శరాఘాతమే!

నోట్ల రద్దు నిర్ణయం తరువాత దేశ వ్యాప్తంగా పప్పుల ధరలో పెరుగుదల కనిపించింది. కూరగాయల ధరల్లో కొద్ది మాత్రం తగ్గుదల కనిపించింది. తగ్గిన కూరగాయల ధరలనే పరిగణలోకి తీసుకున్న రిజర్వు బ్యాంకు రిటైల్‌ ద్రవ్యోల్బణం 5 శాతం ఉంటుందని అంచనా వేయడం గ్రౌండ్ రియాలిటీస్ ని పక్కనపెట్టేయడమే!

ద్రవ్యోల్బణం మరింత పెరిగి, ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురుధరలు పెరుగుతుండటంతో రానున్న కొద్ది మాసాల్లో పెట్రోలు ధరలు 8 నుండి 10 శాతం పెరుగుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్యుని నడ్డి విరుగుతుంది.