పోలవరాన్ని అటకెక్కించారు

0
142
గోదావరి డెల్టా ఎండిపోయే ప్రమాదం -కేంద్రం రిక్తహస్తం చూపుతున్నా నోరుమెదపరేమీ
సీఎం చంద్రబాబునాయుడు తీరుపై కందుల దుర్గేష్‌ ధ్వజం
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 15 : ఎత్తిపోతల పథకాల పేరుతో జీవనాడిగా రాష్ట్ర ప్రజలు భావిస్తున్న పోలవరం ప్రాజక్ట్‌ను సీఎం చంద్రబాబునాయుడు అటకెక్కించారని, 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామని ప్రజలను నమ్మించి నిలువునా మోసగించారని శాసనమండలి మాజీ సభ్యులు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కందుల దుర్గేష్‌ అన్నారు. తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  చంద్రబాబు చేస్తున్న కుట్రల వల్ల గోదావరి డెల్టా ఎండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇపుడు ఎత్తిపోతల పథకాలపై దృష్టి సారించి రైతులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజక్ట్‌ నిర్మాణంలో నిర్వాశితులకు చెల్లించిన విధంగా నష్టపరిహారం పోలవరం ప్రాజక్ట్‌ నిర్వాశితులకు కూడా అందజేయాలని డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చామంటూ కేంద్రం చేసిన ప్రకటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా ఊసే లేదని, రాజధాని నిర్మాణానికి   నిధులు విడుదల చేయలేదని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు ప్రకటించలేదని అన్నారు.కేంద్రం చేయాల్సిన సహాయం చాలా ఉందని, ఇలాంటప్పుడు సీఎం చంద్రబాబు మౌనం దాల్చడం మంచిది కాదన్నారు.ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా బిసీల, ముస్లిమ్‌లకు సబ్‌ ప్లాన్‌ అమలు చేయలేదని విమర్శించారు.  నగదు రహిత సేవలంటూ ప్రచారం  చేస్తున్న బిజెపి , టిడిపి  నేతలు ఫించన్లపై దృష్టి సారించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులరైజ్‌ చేయాలన్నారు. విలేకరుల సమావేశంలో  వెలుగుబంటి అచ్యుతం, చిక్కాల బాబులు, పేట కామరాజు పాల్గొన్నారు.