కోటగుమ్మం వద్ద  కాపుల కంచాల మోత

0
59
బిసీ జాబితలో చేర్చాలని ‘ఆకలి కేకలు’
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 18 : తమను బిసీ జాబితలో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ నగరంలో కాపు సామాజిక వర్గీయులు ఈరోజు కోటగుమ్మం సెంటర్‌లో కంచాలు మోగిస్తూ తమ విన్నపాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్‌ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపు మేరకు వారీ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని కాపు సంఘం, కాపు సంక్షేమ సంఘం నాయకులు కోటగుమ్మం సెంటర్‌లో నోటికి నల్ల వస్త్రాలు కట్టుకుని కంచాలు మోగించి తమ ఆకలి కేకలు వినిపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తమ నాయకుడు పద్మనాభం డిమాండ్‌ చేస్తున్నారని, అందుకోసం ఆయన చేస్తున్న ఉద్యమాలను ప్రభుత్వం  అణచివేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే కాపుల ఆగ్రహాన్ని చవి చూడవలసి వస్తుందని నగర కాపు సంఘం అధ్యక్షుడు ఆకుల వీర్రాజు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, కాపు సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు అల్లూరి శేషునారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి గణేష్‌, కొత్తపేట రాజా, కొల్లిమళ్ళ రఘ, బండారు వెంకటరమణ, వడ్డి మురళి, పిల్లా సూర్యచంద్రరావు, భాస్కర్‌, బత్తిన నారాయణరావు, కుచ్చు శ్రీను తదితరులు పాల్గొన్నారు.