శరవేగంగా పోలవరం పనులు 

0
108
నెలాఖరులో కాంక్రీట్‌, వచ్చే నెలలో డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు
రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా
 రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 18 :  పోలవరం ప్రాజక్ట్‌లో కాంక్రీట్‌ పనులను ఈ నెలాఖరులో ప్రారంభిస్తున్నామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబునాయుడుతో పాటు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి, కేంద్రమంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, పి.అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు పాల్గొంటారని తెలిపారు. ఆర్‌ అండ్‌ బి అతిధి గృహంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజక్ట్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీ నుంచి అధికారులు, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌, పోలవరం ప్రాజక్ట్‌ అథారిటీ ప్రతినిధులు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారని, సీఎం ఆదేశాల మేరకు కాంక్రీట్‌ పనులను చేపడుతున్నామన్నారు. ఇప్పటికే స్పిల్‌ వేకు సంబంధించిన డిజైన్‌ను ఖరారు చేసి ఆమోదం నిమిత్తం కేంద్రానికి పంపామన్నారు. వచ్చే నెలలో డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత గేట్ల నిర్మాణం ప్రాజక్ట్‌ వద్ద జరుగుతుందని, 18 వేల టన్నుల  స్టీల్‌ను వినియోగిస్తున్నామన్నారు. దీంతో పాటు  పది మిలియన్‌ టన్నుల సిమెంట్‌ అవసరమవుతుందని, ఇప్పటికే 26 సిమెంట్‌ కంపెనీలు సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపాయన్నారు. పోలవరం ప్రాజక్ట్‌ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, నిర్మాణాన్ని పూర్తి చేసి 968 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. ప్రస్తుతం 2 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ పనులు జరుగుతున్నాయని, దానిని 3 లక్షల క్యూబిక్‌ మీటర్లకు తీసుకెళ్ళాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ప్రాజక్ట్‌ నిర్మాణానికి అత్యవసరమైన ఏడు ముంపు మండలాలను ఏపీలోకి విలీనం చేయించడంలో సీఎం చంద్రబాబు  కృషి చేయడం వల్ల పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.విలీన మండలాలకు చెందిన ప్రజలకు, పోలవరం నిర్వాశితులకు న్యాయం చేస్తామని, కట్టడానికి ఇచ్చే ప్రాధాన్యత నిర్వాశితుల పునరావాసానికి కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో నీటి పారుదల శాఖ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.