న్యాయం చేశాకే ప్రాజక్ట్‌ పనులు కొనసాగించాలి

0
63
పోలవరం నిర్వాశితులకు మద్ధతుగా రౌండ్‌ టేబుల్‌ సమావేశం
 
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 18 :  పోలవరం ప్రాజక్ట్‌ వల్ల నిర్వాశితులవుతున్న వారికి న్యాయం చేసిన తర్వాతే ప్రాజక్ట్‌ నిర్మాణంలో ముందుకెళ్ళాలని స్ధానిక ఆనం రోటరీ హాలులో ఈరోజు పోలవరం నిర్వాశితుల పోరాట కమిటీ ఆధ్వర్యాన జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. ప్రముఖ సామాజిక వేత్త పెంటపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజక్ట్‌ నిర్వాశితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. నిర్వాశితులకు పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన దుయ్యబట్టారు. నిర్వాశితుల తరఫున చేస్తున్న పోరాటం గురించి వివరించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ  చట్టం అమలు కోసం పోరాటాలు చేయవలసి రావడం దురదృష్టకరమన్నారు.  ప్రతిపక్షాలు మాట్లాడకూడదన్న ధోరణితో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. బాధితుల తరఫున చేపట్టే పోరాటాలకు తాము మద్ధతుగా నిలుస్తామన్నారు. ఢిల్లీ వెళ్ళాలన్న, సీఎంను కలవాలన్నా తాము కూడా ముందుంటామన్నారు.  మరో మాజీ ఎంపి జీవి హర్షకుమార్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోకుండా అణచివేత ధోరణితో వ్యవహరిస్తున్నాయన్నారు. భూములు కోల్పొయి ఇబ్బందులు పడుతున్న గిరిజనుల ఆవేదనను ప్రభుత్వాలు అర్ధం చేసుకోవాలన్నారు. సీపిఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ మాట్లాడుతూ  పోలవరం ప్రాజక్ట్‌ కింద నష్టపో తున్న నిర్వాశితులను తక్షణం ఆదుకోవాలన్నారు. విలీన గ్రామాల్లోని ప్రజల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. సీపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ పోలవరం ప్రాజక్ట్‌ నిర్వాశితుల సమస్యలపై ఇటీవలే తాము పాదయాత్రలు చేసి తెలుసుకున్నామని, అక్కడ ప్రజలు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం, విద్యా సౌకర్యాలు కరవయ్యాయని, కనీసం మౌలిక వసతులకు కూడా గిరిజనులు నోచుకో వడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ మాట్లాడుతూ ఎత్తిపోతల పథకాలకు ఖర్చు పెడుతున్న నిధులను ప్రభుత్వం నిర్వాశితుల పునరావాసానికి ఖర్చు చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. నిర్వాశితులను ఆదుకోకుంటే తిరుగుబాటు తప్పదన్నారు. పెంటపాటి పుల్లారావు ఆధ్వర్యంలో చేపట్టే పోరాటాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తరఫున మద్ధతుగా నిలుస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ  నిర్వాశితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌ మాట్లాడుతూ చట్టాలను ప్రభుత్వం అమలు చేయకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అన్నారు. నిర్వాశితులకు అండగా కాంగ్రెస్‌ పార్టీ నిలుస్తుందన్నారు.  సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్‌ మాట్లాడుతూ ఇంత అధిక సంఖ్యలో నిర్వాశితులు అవుతున్న ప్రాజక్ట్‌ దేశంలో మరొకటి లేదన్నారు. 8 మండలాలు, 400 గ్రామాల్లో ప్రజలు నష్టపోతున్నారన్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదన్నారు. పోలవరం ప్రాజక్ట్‌ మొదటి దశ, రెండవ దశ అంటూ పునరావాసం కల్పించే   విషయంలో నష్టాన్ని తగ్గించి చూపేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలవరం నిర్వాశితులు త్యాగాలు చేయలేదని, బలవంతంగా వారిని నిలబెట్టారని పేర్కొన్నారు. మిర్చి పంటపై ఏటా ఎకరానికి  2.5 లక్షల వరకు లాభం వచ్చే భూమికి కేవలం రూ. 1.50 లక్ష మాత్రమే నష్టపరిహారం ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. సరైన పరిహారం ఇచ్చే వరకు ప్రాజక్ట్‌ను ఆపాలన్నారు. ఆప్త మిత్ర సంస్థ డైరక్టర్‌ ముచ్చిక రంజిత్‌కుమార్‌ దొర మాట్లాడుతూ గత 35 రోజులుగా నిర్వాశితులు నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అడవినే నమ్ముకున్న గిరిజనులను అక్కడ నుంచి పంపివేస్తే ఎలా బ్రతుకుతారని, రూ. 10 లక్షలు  ఇచ్చినా బ్రతకలేమన్నారు. ఇంటికో ఉద్యోగం, భూమి లేని వారికి  రెండు ఎకరాల భూమిని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  బిజెపి జిల్లా అధ్యక్షులు వై.మాలకొండయ్య, ఆర్పీసి నాయకులు మేడా శ్రీనివాస్‌, న్యాయవాది పల్లా త్రినాధరావు, జెవి సత్యనారాయణ, అంగులూరు గ్రామానికి చెందిన కనకదుర్గ తదితరులు మాట్లాడారు. సమావేశానికి సిపిఐ జిల్లా అధ్యక్షులు తాటిపాక మధు స్వాగతం పలికారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, గిరిజన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.