నల్ల పరుగు

0
81
గిరీశం బొత్తిగా తీరిగ్గా ఉన్నాడు. ఆ మాటకొస్తే గిరీశం ఎప్పుడూ తీరికే. ఏదో ఆ వెంకటేశంతో కథలూ, ఊళ్ళో జనాలతో కబుర్లూ, నోట్లో చుట్టా… యిదీ లోకం. యితరత్రా ఏ వ్యవహారాల జోలికీ పోడు. టెన్షన్‌లూ పెట్టుకోడు. ఆరోజు కూడా అలాగే నోట్లో చుట్ట గుప్పుగుప్పుమనిపిస్తూ యింటి అరుగుమీద కూర్చుని ఉండగా వెంకటేశం దిగబడ్డాడు. అయితే వెంకటేశం రావడం రావడంతోనే కొంత వేదాంత ధోరణిలో కనిపించాడు. పైగా ‘ఏ నిమిషాన ఏమి జరుగునో’ అని పాత పాటేదో పాడు కుంటూ మరీ వస్తున్నాడు. దాంతో గిరీశం కంగారుపడి ”ఏవివాయ్‌ వెంకటేశం… కొంపదీసి పెళ్ళీ గిళ్ళీ గానీ కుదిరిందా?” అంటూ అడిగాడు. దాంతో వెంకటేశం నిట్టూర్చి ”ఆ… యిప్పుడు అదొక్కటే తక్కువ ” అన్నాడు. దాంతో గిరీశం విసుక్కుని ”యింతకీ నీ బాధేంటో చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం ”ఏం లేదు గురూగారూ… రాత్రో కలొచ్చిందిలెండి. 2000 రూపాయల నోట్లు  రద్దు చేసేశా రంట. దాంతో నేను కష్టపడి మార్చుకున్న  2000 నోట్ల కట్టలు పట్టుకుని పరుగులెట్టానంట…” అన్నాడు.  దాంతో గిరీశం నవ్వేసి ”సరే… ఈ వారం ప్రశ్నేదో దీనిమీదే లాగించేద్దాం. నీ కలలో వచ్చిన నీ పాత్రనే వివ్లేషించి చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం కొద్దిగా ఆలోచించి చిన్న ఊహలాంటిది చెప్పసాగాడు…
అఅఅఅ
చాలా ఏళ్ళనాటి మాట… అప్పట్లో గంగలకుర్రు సంస్థానాన్ని వెంకటేశం జమీందారు పాలించడం జరిగింది. యిక వెంకటేశం జమీందారయితే అటు మంచి పాలనా దక్షుడే కాదు. యిటు దాన కర్ణుడు కూడా. అసలే సంస్థానానికి కోనసీమలోనూ, యింకా మెట్ట ప్రాంతంలోనూ వేలాదిగా ఎకరాల భూమి ఉంది. దాంతో ప్రతిభావంతులు ఎవరొచ్చినా వారి ప్రతిభకి తగ్గట్టుగా నజ రానాలిచ్చేవాడు. అలాంటి జమీందారు గారి దగ్గరికి ఆరోజు కోటి లింగం రావడం జరిగింది.  సదరు కోటిలింగం గణితశాస్త్రంలో నిష్ణాతుడు. లెక్కల్లో తన ప్రావీణ్యం చూపించేసరికి అంతా నోరెళ్ళ బెట్టారు. యిరవై అంకెల సంఖ్యని యింకో యిరవై అంకెల సంఖ్యతో గుణిస్తే ఎంతొస్తుందో సైతం క్షణాల్లో అవలీలగా చెప్పేస్తు న్నాడు. దాంతో వెంకటేశం జమీందారు గారయితే చాలా ముచ్చట పడిపోయారు. ”శభాష్‌ పండితోత్తమా… నీ మేధస్సు అపారం. నీకేం కావాలా కోరుకో. మణులా… మాణిక్యాలా… భూమి కావాలా?” అనడిగారు. దాంతో కోటిలింగం నసుగుతూ  ”ఏదో కొద్దిగా భూమి యిప్పించండి జమీందారుగారూ..” అన్నాడు. దాంతో వెంకటేశం జమీందారుగారు ”కొంచెం కాదు. ఎక్కువే తీసుకో. ఒక రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్త మయం వరకు తిరిగినంత మేరా భూమిని తీసుకో” అన్నారు. జమీందారు అలా అనేసరికి కోటిలింగం చాలా ఆనందపడ్డాడు. పైగా ఆశ కూడా పెరిగిపోయింది. అలాగేనని తలూపి శెలవు తీసుకున్నాడు.
అఅఅఅ
మర్నాడు సూర్యోదయంతోనే కోటిలింగం భూమి వేటలో పడ్డాడు.  తిరిగినంతమేరా భూమిని యిస్తామని జమీందారుగారు అనడంతో కోటిలింగానికి ఆశ పెరిగిపోయింది. దాంతో అలా సూర్యుడు ఉదయించాడో లేదో యిలా పరుగందుకున్నాడు. వెనుకే జమీందారుగారి సంస్థానంలో ఉండే సేవకులిద్దరు ఆ పరిగెత్తిన మేరా ముగ్గువేస్తూ గుర్రాలమీద అనుసరిస్తున్నారు. తొందర్లోనే కోటిలింగం అలిసిపోయాడు. అయినా పరుగాపలేదు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నమయింది. ఆపాటికి సూర్యుడు నడినెత్తిమీదకొచ్చేశాడు. ఈలోగా ఆ సేవకుల్లో కన్నప్ప ”బాబుగారూ… చాలా దూరం వచ్చేశాం. మళ్ళీ బయల్దేరిన చోటుకి చేరుకోవాలి కదా” అన్నాడు. అయితే దాన్నేవీ కోటిలింగం పట్టించుకోలేదు. అలా పరిగెడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం మూడు కావస్తుండగా కన్పప్ప మళ్ళీ హెచ్చరించాడు. దాంతో ఏవనుకున్నాడో కోటిలింగం ఆ పరుగాపి వెనుదిరిగాడు. అయితే అప్పటికే బాగా అలిసిపోయిన కోటిలింగం పరిగెత్తలేకపోయాడు. పైగా రొప్పు వస్తోంది. అయినా యింకోపక్క సూర్యుడు దిగిపోతుంటే కంగారెక్కువయిపోయింది. సూర్యుడు అస్తమించే లోగా గమ్యం చేర గలనా లేదా అన్న అనుమానం వచ్చేసింది. దాంతో మళ్ళీ పరుగు మొదలెట్టాడు. మొత్తా నికి సూర్యాస్త మయం కావస్తుండగా  బయలుదేరిన చోటుకి కనుచూపు మేరలోకి వచ్చేశాడు. అయితే అప్పుడు జరిగిందది. అలా పరిగెడుతున్న కోటిలింగం హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. కన్నప్ప దగ్గరకొచ్చి చూసేసరికి కోటిలింగం అప్పటికే మరణించి ఉన్నాడు. దాంతో కన్నప్ప గబగబా జమీందారు గారి దగ్గరకెళ్ళి ”ఆ కోటి లింగం బయల్దేరిన చోటుకి రాలేక పోయాడు” అంటూ జరిగింది చెప్పాడు. దాంతో జమీందారుగారు నిట్టూరుస్తూ ”చని పోయినవాడికి యింక భూమితో పనే ముందిలే… అయినా తనకి అవసరమయిన ఆరడుగులు సాధించుకున్నాడు కదా. ఆ ఆరడుగుల నేలలో అతనిని సమాధి చేసెయ్యండి” అన్నారు.
అఅఅఅ
”అది గురూగారూ… చిన్న ఊహ” అన్నాడు వెంకటేశం. దాంతో గిరీశం ”అయితే చిన్న పిల్లల కధ చెప్పి సరిపెట్టేసేవన్నమాట” అన్నాడు. దాంతో వెంకటేశం ”చిన్న పిల్లల కధేంటి గురూగారూ.. అందులో అంతా తెలుసుకోవలసిన జీవిత సత్యం ఉంది” అన్నాడు. గిరీశం తలూపి ”సరే…అదేదో కొంచెం వివరంగా చెప్పు” అన్నాడు. దాంతో వెంకటేశం వివరంగా చెప్పడం మొదలెట్టాడు. ”నా కథలో కోటిలింగం ఎక్కడో లేడు. మనలోనే ఉన్నాడు. డబ్బు సంపాదన కోసం నిరంతరాయంగా అడ్డూ అదుపూ లేకుండా వెంపర్లాడే వాళ్ళందరూ అతడి ప్రతినిధులే. డబ్బు సంపాదించడం అవ సరమే. అయితే అదేదో మన అవసరాలు తీర్చుకోడానికో, కొంచెం విలాసంగా ఉండడానికో, యింకా భవిష్యత్‌ భద్రత కోసమో ఉండాలి. అంతేగానీ డబ్బే పరమావధి అన్నట్టుగా వందల తరాలు తిన్నా తరగనంత అక్రమంగా సంపాదించాలనుకోవడం సరియైన ఆలోచన కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఒక పేదవాడు ప్రశాంతంగా నిద్రపో గలుగుతాడు. అదే వందల కోట్లో, వేల కోట్లో ఉన్న కుబేరుడు హాయిగా నిద్రపోలేడు. అనుక్షణం తన డబ్బుని ఎలా పరి రక్షించు కోవాలా అన్న ఆందోళనలో ఉంటాడు. దాంతో బీపీ, షుగరూ, హార్ట్‌ ఎటాక్‌ల్లాంటి రోగాలు బోనస్‌గా వచ్చి చేరతాయి. పోనీ యింత కష్టపడి సంపాదించినా డబ్బు, బంగారం, యితరత్రా ఆస్తుల్ని  తనతో చనిపోయినప్పుడు పట్టుకుపోతాడా అంటే ఏంలేదు. అన్నీ యిక్కడే వదిలేసి వెళ్ళాల్సిందే. తర్వాత అవి ఎవరెవరి పరమవుతాయో ఎవరికీ తెలీదు. అంతమాత్రానికే జీవించడంలో ఎన్నో ఆనందాల్ని కోల్పోయి యిన్ని టెన్షన్‌లూ, వెంపర్లాటలూ కొని తెచ్చుకోవడం అవసరమా? అంతెందుకూ… ఈ మధ్యే వెళ్ళి పోయిన ద్రవిడ మహారాణిని తీసుకుంటే  ఎన్నో వేలకోట్లు వెన కేయడం, ఆనక విచారణ సమయంలో జైలుకెళ్ళడం, తర్వా తెప్పుడో నిర్దోషిగా ప్రకటించబడి బయటికి రావడం జరిగింది. యిక ఆవిడ చివరి దశ ఎంత దారుణంగా గడిచిందని… అన్ని వేల కోట్లూ ఆవిడని కాపాడగలిగాయా? తన కూడా తీసుకెళ్ళ గలిగిందా? యిప్పుడా సంపదంతా ఎవరెవరికో వెళ్ళిపోతోంది. అంత సంపాదించడానికి సదరు మహారాణి గారు ఎంత చెడ్డ పేరు మాటగట్టుకున్నారని… అయితే అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే… పదికోట్లున్నా, లక్ష కోట్లున్నా తినేతిండీ, ఉండే యిల్లూ, జీవిత విధానం… వీటిలో పెద్దగా వ్యత్యాసం వచ్చెయ్యదు. అయినా యింకా యింకా సంపాదించాలనే వెంప ర్లాట ఎందుకని?” అంటూ ముగించాడు. అంతా విన్న  గిరీశం ”ఆ… బాగా చెప్పావోయ్‌… యిదేదో అందరూ అర్థం చేసుకుని మోడీగారు తలపెట్టిన మహా యజ్ఞానికి సహకరిస్తే  బాగుం టుంది. అది భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడడానికి ఎంతో ఉపకరి స్తుంది. ఆ…యింకో విషయమోయ్‌… నీ కలలోలాగ 2000 రూపాయల నోట్ల రద్దేవీ యిప్పట్లో ఉండదు. యింకా అప్పటి నోట్ల రద్దు హడావిడి సద్దుమణగకముందే ప్రభుత్వం అలాంటి సాహసం చేయదు” అంటూ ముక్తాయించాడు.
– డాక్టర్‌ కర్రి రామారెడ్డి