నోట్ల రద్దు కష్టాలపై 23న ‘ఛలో వెలగపూడి’

0
72
నోట్లు రద్దు నిర్ణయం అనాలోచితం – పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 21 : రూ.500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడం అనాలోచిత నిర్ణయమని, ఇది అట్టర్‌ప్లాప్‌ అయ్యిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. స్ధానిక కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి దేశప్రజలకు పంచుతామన్న ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేసి ప్రజలను కష్టాలోకి నెట్టారన్నారు. దేశంలో 86శాతం ఉన్న పెద్దనోట్లును రద్దుచేయడంతో కార్మికులు, రైతులు, వివిధ రంగాలలోని వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పండ్లు, చేపలు వంటి సరుకులు అమ్మే వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకోలేక తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. రైతు తను పండించిన పంటను అమ్ముకోలేక, తిరిగి పంట వేయాలంటే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి చేతిలో డబ్బులు లేక అల్లాడుతున్నారన్నారు. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులు పాలైన వారికి వైద్యం ఏవిధంగా చేయించాలో తెలియని దిక్కులేని పరిస్ధితల్లో ప్రజలు నెట్టబడ్డారన్నారు. ప్రధాని లక్ష్యం గురి తప్పిందని, దెబ్బ పేదలకు తగిలిందన్నారు. ఒక ప్రక్క ప్రజలు నోట్లు రద్దుతో కష్టాలు పడుతుంటే మరో పక్క విజయమాల్యా లాంటి వ్యక్తులకు రూ. 7000 కోట్ల రుణాన్ని మాఫీ చేశారన్నారు. డీమానిటైజేషన్‌ అట్టరప్లాప్‌ అయ్యిందని, ఇప్పుడు డిజిటలైజేషన్‌ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కార్డు చెల్లింపులు అంటున్నారని దీని వల్ల ప్రజలు చేసే ప్రతి ఖర్చుకు 1నుంచి 4శాతం ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందన్నారు. ఇది కార్పొరేట్‌ సంస్ధలకే లాభం అన్నారు. కార్డు చెల్లింపులు వల్ల భారతీయ ఆర్ధిక వ్యవస్ధ మొత్తం పెట్టుబడిదారులు, కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్లు రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలపై ఈనెల 23న ‘ఛలో వెలగలపూడి’కి పిలుపునిచ్చామన్నారు. డిడిపి, బిజెపిలు మినహా రాష్ట్రంలోని మిగిలిన పార్టీల వారందరినీ కూడా వెలగలపూడిలో నిర్వహించే ప్రజా ధర్నాకు ఆహ్వానిస్తున్నామన్నారు. 23న పెద్దఎత్తున ప్రజలు హాజరై నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వాలకు తెలియజేయాలన్నారు. ఈ సందర్భగా ఛలో వెలగలపూడి గోడపత్రికలను ఆవిష్కరించారు.
రేపు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ప్రమాణస్వీకారం
జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా రేపు మధ్యాహ్నం పంతం నానాజీ కాకినాడలో జరిగే కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేస్తారని రుద్రరాజు తెలిపారు. అలాగే ప్రత్యేక ¬దాపై ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక ¬దాకోసం కాంగ్రెస్‌ పార్టీ తరపున మొదటి నుంచి పోరాడుతున్నామన్నారు. సంతకాల సేకరణ నిర్వహించి ప్రధానికి అందజేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రజాబ్యాలెట్‌ చేపట్టామన్నారు. రేపటి ప్రమాణస్వీకారోత్సవానికి, ప్రజాబ్యాలెట్‌ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరు కావాల్సిందిగా కోరారు. విలేకరుల సమావేశంలో నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌వి శ్రీనివాస్‌, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు బోడ వెంకట్‌, కార్పొరేటర్‌ రాయుడు సతీష్‌, నాయకులు కొత్తూరు శ్రీనివాస్‌, దాసి వెంకట్రావు, అంకం గోపి, బాలేపల్లి మురళి, బెజవాడ రంగారావు, ఎస్‌కె జిలానీ, కొల్లిమళ్ళ రఘు, తాళ్ళూరి విజయకుమార్‌, ముళ్ళ మాధవ్‌, కొవ్వూరి శ్రీనివాస్‌, గోలి రవి, కాటం రవి, నలబాటి శ్యామ్‌, అబ్దుల్లా షరీఫ్‌, రాజా పండు, నరాల పార్వతి, కె కుమారి తదితరులుపాల్గొన్నారు.