ప్రెస్‌క్లబ్‌లో ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు

0
65
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 24 : ప్రేమ.. శాంతి స్వరూపుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని  ప్రపంచంలోని అన్ని దేశాలలో జరుపుకుంటారని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్ధానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం నాడు క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈవేళ సంపాదకులు డిఎ లింకన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పాస్టర్‌ గుళ్ళ మార్టిన్‌ శాంతికుమార్‌, తుమ్మిడి బ్రదర్స్‌ అధినేతలు తుమ్మిడి విజయకుమార్‌, తుమ్మిడి అరుణ్‌కుమార్‌, పాస్టర్‌లు రాజా విజయకుమార్‌, రత్నం రాజులు పాల్గొని క్రిస్మస్‌ కేక్‌ను కట్‌చేసి, క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. మార్టిన్‌ శాంతికుమార్‌ క్రిస్మస్‌ సందేశాన్ని అందిస్తూ మానవాళికి తోడుగా నిలవడానికి యేసుక్రీస్తు జన్మించారన్నారు. మానవుల పాపాన్ని యేసుక్రీస్తు తన రక్తంతో కడగివేశారని చెప్పారు. క్రైస్తవం అంటే మతం కాదని ఒక మార్గమని వివరించారు. తుమ్మిడి విజయకుమార్‌ మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయుల మధ్య క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించుకోవడం ఆనందదాయకమన్నారు. పాస్టర్‌ రాజా విజయకుమార్‌ మాట్లాడుతూ తండ్రి సువార్తను మానవులకు చేరవేయడానికి యేసుక్రీస్తు భూమిపైకి వచ్చారని ఆ రకంగా యేసుక్రీస్తు కూడా పాత్రికేయుడేనని, దేవుని సువార్తను ప్రజలకు చేరువేస్తున్న దైవ సువార్తకులు కూడా పాత్రికేయులేనన్నారు. ప్రెస్‌క్లబ్‌ మాజీ అధ్యక్షులు జిఎ భూషణ్‌బాబు,  ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు కుడిపూడి పార్ధసారధి, ప్రెస్‌క్లబ్‌ మాజీ కార్యదర్శి దాకే లక్ష్మణస్వామి, ఎబిఎన్‌ పాత్రికేయుడు రాజబాబులు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమత సామరస్యాన్ని చాటే విధంగా ప్రెస్‌క్లబ్‌లో క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించడం, పాత్రికేయులంతా పాల్గొనడం స్వాగతించదగిన విషయమన్నారు. ఇదొక సత్‌సంప్రదాయానికి  నాంది పలకాలన్నారు.  సాక్షి సాయంకాల పత్రిక పాత్రికేయుడు కూశెట్టి శ్రీనివాస్‌(నాని) స్వాగతం పలకగా, లింకన్‌ వందన సమర్పణ చేశారు. వివిధ పత్రిలు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన పాత్రికేయులు, ఫొటోగ్రాఫర్‌లు, వీడియో గ్రాఫర్‌లు పాల్గొన్నారు.