అనాలోచిత నిర్ణయాలతో అన్నీ కష్టాలే

0
99
నోట్ల రద్దుతో రైతుల్లో నిరాసక్తత – ఆహార సంక్షోభం నెలకొనే ప్రమాదం
నగదు రూపంలో ఫించన్లు అందించకుంటే ప్రత్యక్ష ఆందోళన
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ప్రకటన
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 28 : కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన పౌరఫరాల శాఖ  రైతులకు చెల్లించవలసిన సొమ్మును బ్యాంక్‌ ఎకౌంట్లలో జమ చేసిందని, అయితే రైతులకు కూడా పరిమితి నగదును మాత్రమే చెల్లించడం వల్ల రెండవ పంట వేసేందుకు ఆసక్తి చూపడం లేదని,  దీంతో ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు  అన్నారు. నగరానికి వచ్చిన జాంపేటలోని పార్టీ కార్యాలయంలో సిటీ కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాలతో కలిసి విలేకరులతో మాట్లాడారు.జిల్లాలో రైతు పండించిన ధాన్యాన్ని అరకొరగా కొనుగోలు చేస్తున్నారని, దీనికి తోడు గిట్టుబాటు ధర లేకపోవడం, పెద్ద నోట్లు రద్దు కావడం  కారణమన్నారు. పండించిన కష్టాన్ని బ్యాంక్‌ల ద్వారా పూర్తిగా తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల రైతు కూలీలకు డబ్బులు చెల్లించడం లేదని, రెండవ పంటకు పెట్టుబడి పెట్టలేక వెనుకంజ వేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం తక్షణమే రైతు సమస్యలపై దృష్టి సారించి ధాన్యం కొనుగోలు మొత్తాన్ని నగదు రూపంలో తక్షణమే అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రతి నెల అందించే సామాజిక ఫించన్లను కూడా బ్యాంక్‌ ద్వారా పంపిణీ చేయాలని ఆలోచన చేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.బ్యాంక్‌ల వద్ద వృద్ధులు, వికలాంగులు పడుతున్న బాధలు ప్రభుత్నానికి కనిపించవా అని ప్రశ్నించారు. వచ్చే నెల ఫించన్లను నగదు రూపంలో అందించకపోతే తమ పార్టీ వారి పక్షాన ప్రత్యక్ష ఆందోళన చేపడుతుందని ప్రకటించారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధక బాధలు ఆలోచించాలని సూచించారు. చౌక ధర దుకాణం నుంచి పంపిణీ చేసే కిరోసిన్‌ను రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అరాచకమన్నారు. దీపం కనెక్షన్లను సాకుగా చూపి కిరోసిన్‌ పంపిణీ ఎగవేతకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. దీపం కనెక్షన్ల వల్ల ఇంటికి వెలుగు రాదని, ఇప్పటికి విద్యుత్‌ సరఫరా లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. నగదు రహితంపై క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకోవాలని, ప్రచార ఆర్భాటం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. పోలవరం ప్రాజక్ట్‌ విషయంలో నిర్వాశితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ముందుగా వారికి న్యాయం చేసి పనులు కొనసాగించాలన్నారు.పోలవరం నిర్మాణానికి నాబార్డ్‌ ద్వారా తెచ్చిన నిధులను పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి ఖర్చు చేసేస్తారన్న ఆందోళన  ప్రజల్లో ఉందన్నారు. వైఎస్సార్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తవ్వించిన కాలువల నుంచి నీటిని పంపిస్తూ తెదేపా ప్రభుత్వం అది తమ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రాజ్యాంగ విరుద్ధంగా స్ధానిక సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా జన్మభూమి కమిటీలను నియమించారని ఈ కమిటీలపై ఆ పార్టీ నాయకులే విసుగు చెందుతున్నారన్నారు. ఇలాంటి నిర్ణయాలే చంద్రబాబుకు నష్టం తెస్తాయని, ఇకనైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. విలేకరుల సమావేశంలో సేవాదళ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సుంకర చిన్ని, ఫ్లోర్‌ లీడర్‌  షర్మిళారెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మీ, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మీ, కార్పొరేటర్లు బొంత శ్రీహరి, పిల్లి నిర్మల,మజ్జి నూకరత్నం, పార్టీ నాయకులు గిరజాల బాబు, వాకచర్ల కృష్ణ,  డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గుత్తుల మురళీధర్‌, పోలు కిరణ్‌కుమార్‌ రెడ్డి, గుర్రం గౌతమ్‌,మజ్జి అప్పారావు, అడపా శ్రీహరి, కానుబోయిన సాగర్‌, కాటం రజనీకాంత్‌, కుక్కా తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు.