మాట తప్పరు….మడమ తిప్పరు

0
72
అభివృద్ధికి నమునా చంద్రబాబు –  పోలవరం నిర్మాణం ఆయనతోనే సాధ్యం
రాష్ట్రం కోసమే ఢిల్లీ పెద్దలతో సఖ్యత – ఆయనకు అండగా ఉండటం మన బాధ్యత
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 30 :  మాటకు కట్టుబడి అభివృద్ధి చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన నాయకుడు మరొకరు ఉండరని, పోలవరం నిర్మాణం చంద్రబాబు వల్ల సాధ్యం కాదని  కొంతమంది నాయకులు చేసిన విమర్శలకు సమాధానం చెప్పేలా ఈరోజు ఆ ప్రాజక్ట్‌  కాంక్రీట్‌ పనులకు శ్రీకారం చుడుతుండటం శుభపరిణామమని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారని, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారుతుందని పేర్కొన్నారు. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్‌ కాంక్రీట్‌ పనుల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మించాలని 75 ఏళ్ళ క్రితమే బ్రిటీష్‌ హయాంలో అంచనాలు రూపొందించారన్నారు. చాలామంది నేతలకు పోలవరం రాజకీయ నినాదంగా మిగిలిపోయిందన్నారు. 1981లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య పోలవరం నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారని గుర్తు చేశారు. అయితే 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొంత కదలిక వచ్చిందని, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేసినప్పటికీ కదలిక తేవడంలో ఆయన పాత్ర ఉందన్నారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన అప్పటి మంత్రులు ప్రాజెక్ట్‌ను అడ్డుకున్నారని, కేంద్ర మంత్రిగా ఉన్న జైరాం రమేష్‌ ఆటంకాలు సృష్టిస్తూ నిరోధకుడిగా నిలిచారని విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్టుగా చేశారన్నారు. అయినప్పటికీ రెండున్నరేళ్ళ కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తమ వంతుగా పనులు చేపట్టిందని, అందువల్లే జాతీయ హోదా ప్రకటించినప్పటికీ నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చిందన్నారు. దీనిపై కొంతమంది వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ను ఎలాగైనా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే ఏడు ముంపు మండలాలను తెలంగాణా నుంచి ఏపీలోకి విలీనం చేయించారని తెలిపారు. కుడి కాలువ నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు సరఫరా చేస్తున్నారని, ఎడమ కాలువ నుంచి విజయనగరం వరకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబునాయుడు వల్ల పోలవరం సాధ్యం కాదని రాజమండ్రికి చెందిన ఓ మేధావి పదేపదే వ్యాఖ్యానించేవారని, అలాంటి విమర్శలు చేసిన వారందరికీ ఈరోజు జరుగుతున్న కాంక్రీట్‌ పనుల ప్రారంభోత్సవం చెంపపెట్టు వంటిదన్నారు. విభజన తరువాత రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో సమర్ధత కలిగిన చంద్రబాబును ఎన్నుకున్నారని, వారి ఆశలు, నమ్మకాలను వమ్ము చేయకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ పెద్దలతో సఖ్యతగా  ఉంటున్న  విషయాన్ని విమర్శకులు గుర్తెరగాలన్నారు. అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిని ఎంపిక చేసిన చరిత్ర చంద్రబాబు నాయకత్వానికి ఉందని, ఇవేమీ తెలియకుండా నోటికొచ్చినట్లు మాట్లాడవద్దని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ప్రాజెక్ట్‌లు పూర్తి చేయడం అసాధ్యమని చెప్పారు. చంద్రబాబు  ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని, ఐదు కోట్ల తెలుగు ప్రజలు ఆయనకు అండగా నిలవాలని కోరారు. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సహకరిస్తున్న ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, ఉమా భారతిలకు కృతజ్ఞతలు తెలిపారు.  విలేకరుల సమావేశంలో దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు, మాజీ కార్పొరేటర్‌లు కురగంటి సతీష్‌, రెడ్డి మణి, పార్టీ నాయకులు ఉప్పులూరి జానకిరామయ్య, మళ్ళ వెంకట్రాజు పాల్గొన్నారు.