సమన్వయంతో గంజాయి సాగుకు అడ్డుకట్ట

0
66
వచ్చే వారంలో సమీక్షా సమావేశం – ఎక్సైజ్‌, ప్రొహిబిషన్‌ అధికారి వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం, జనవరి 2 : గంజాయి సాగు, అక్రమ రవాణా అరికట్టేందుకు రాష్ట్ర డీజీపి ఎన్‌.సాంబశివరావు ఆధ్వర్యంలో అన్ని శాఖలను సమన్వయపరుస్తున్నారని, వచ్చే వారంలో రాజమహేంద్రవరంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారని ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టర్‌  కె.వెంకటేశ్వరరావు తెలిపారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన  ఎక్సైజ్‌ అధికారులతో వై జంక్షన్‌లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో గంజాయి స్మగ్లర్ల  ఆగడాలు పెరిగాయని, వారి అరాచకాలను అడ్డుకునేందుకు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ పోలీసుల సహకారంతో దాడులు నిర్వహిస్తామన్నారు. 2015-16 సంవత్సరంలో జిల్లాలో ఎనిమిది గంజాయి కేసులు, 2016-17 కేసులో ఏడు కేసులు నమోదయ్యాయని  తెలిపారు. 2015-16 లో  16, 009 కేజీల గంజాయిని, 2016-17లో 13,575 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 2015-16లో 9 వాహనాలను, 2016-17లో 71 వాహనాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. 2015-16లో గంజాయి కేసులో ్ల 250 మందిని,  2016-17లో 199 మందిని అరెస్టు చేశామన్నారు. జిల్లాలో   10 వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు  సమాచారం వచ్చిందన్నారు. రాయలసీమ ప్రాంతాల్లో కూడా గంజాయి సాగు జరుగుతోందని దానిపై కూడా దృష్టి సారించామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే ఎక్సైజ్‌ సిబ్బందికి ఆర్థిక సహాయం విషయంలో ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ సిహెచ్‌.గోపాలకృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్లు ఎన్‌.బాబాజీ రావు, పి.రామచంద్రరావు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు ఎన్‌.సుర్జీత్‌సింగ్‌,  సుధీర్‌, విఎస్‌ఆర్‌సి మూర్తి పాల్గొన్నారు.