అంబరాన్ని తాకేలా సంక్రాంతి సంబరాలు

0
80
6, 7 తేదీల్లో ప్రదర్శన – పాల పోటీలు – 8న సంక్రాంతి వేడుకలు
భారతీయ విద్యాభవన్స్‌లో సంప్రదాయాల మేళవింపు
రాజమహేంద్రవరం, జనవరి 3 : భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా భారతీయ విద్యా భవన్స్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా అఖిల భారతదేశపు ఆవుల ప్రదర్శన , పాల పోటీలు, ముర్రా జాతి గేదెల ప్రదర్శనను ఈనెల 6, 7తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్‌ చెఱుకువాడ శ్రీరంగనాధరాజు తెలిపారు. నామవరంలోని భారతీయ విద్యాభవన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యతోపాటు దేశ సంస్కృతి, సాంప్రదాయాలపై  అవగాహన కల్పిస్తూ, పశు సంపదను పరిరక్షించుకోవాలన్న ఉద్దేశ్యంతో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. గతంలో భీమవరంలో నిర్వహించామని, ఈ ఏడాది 6, 7 తేదీల్లో గో ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఇందులో ఒంగోలు జాతి, పుంగనూరు జాతి, గిర్‌ జాతి, లాల్‌ కాందారి, సాహివాల్‌ జాతి, దేవుని జాతి, తార్‌పార్‌కర్‌ జాతి, హలికర్‌, కాక్రిజ్‌, కపిలరంగు, ముర్రా జాతులకు చెందిన ఆవులు పాల్గొంటున్నాయన్నారు. ఆవులతోపాటు గేదెలు, గుర్రాల ప్రదర్శన జరుగుతుందని, వీటితోపాటు పాల పోటీలు జరుగుతాయన్నారు. గో ప్రదర్శనలో మొదటి బహుమతిగా రూ.50వేలు, రెండవ బహుమతిగా రూ.40వేలు, మూడవ బహుమతిగా రూ.30వేలతోపాటు జ్ఞాపికలు అందిస్తామని, అందాల పోటీల్లో పాల్గొనే పెద్ద, పాలపాళ్ళు జాతులకు పోటీలు నిర్వహించి మొదటి బహుమతిగా రూ.20వేలు, రెండవ బహుమతిగా రూ.15వేలు, మూడవ బహుమతిగా రూ.10వేలతోపాటు జ్ఞాపికలు అందజేస్తామన్నారు. ఈ ప్రదర్శనలో 400 వివిధ జాతుల ఆవులు, 60 గుర్రాలు పాల్గొంటున్నాయన్నారు. 8వ తేదీన సాంప్రదాయాల మేళవింపుగా ఆనాటి సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు తెలుగువారికి చవులూరించే రకరకాల వంటకాల ప్రదర్శన ఉంటుందన్నారు. వ్యవసాయంతోపాటు పాడి ఆవశ్యకతను తెలియజేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. 7వ తేదీన భారతీయ విద్యా భవన్స్‌ 5వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని, ముఖ్యఅతిధిగా ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఎం.ముత్యాలనాయుడు పాల్గొంటున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో రెడ్డి ప్రసాద్‌, పి.గోపాలకృష్ణ, ప్రిన్సిపాల్‌ సత్యేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.