5న సీఎం చంద్రబాబు రాక

0
70
పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు శంకుస్థాపన
రామచంద్రపురం నియోజకవర్గంలో జన్మభూమికి హాజరు
రాజమహేంద్రవరం, జనవరి 3 : గోదావరి ఎడమ గట్టున సీతానగరం సమీపాన ఉన్న పురుషోత్తమపట్నం వద్ద చేపట్టనున్న ఎత్తిపోతల పథకానికి ఈ నెల 5న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 1,637 కోట్లతో రెండు విడతల్లో ఈ పథకాన్ని చేపడుతున్నారు. దాదాపు తొమ్మిది నెలల వ్యవధిలో ఈ పథకాన్ని పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ పథకం పూర్తయితే అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో  67 వేల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. అంతేగాక పిఠాపురం బ్రాంచి కెనాల్‌ పరిధిలో 20 వేల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుంది.  శంకుస్థాపన కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో ముఖ్యమంత్రి రైతులను ఉద్ధేశించి ప్రసంగిస్తారు.  గోదావరి బ్యారేజీకి ఎగువన 40 కి.మీ. వద్ద  పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం  చేపట్టనున్నారు. ప్రతి ఏటా జులై 1 నుంచి డిసెంబర్‌ 1 మధ్య కాలంలో గోదావరి వరదలు వచ్చినపుడు ప్రతి రోజూ 3,500 క్యూసెక్కుల నీటిని ఈ పథకం ద్వారా విడుదల చేస్తారు. 350 క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న 10 పంపులను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్ళించిన ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా  అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలకు, అన్నదాతలకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. కాగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు ముందుగానే మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని, లేని పక్షంలో ప్రాజక్ట్‌ నిర్మాణం అడ్డుకుంటామని రైతు సంఘం హెచ్చరించింది.  ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు విస్తృత పోలీస్‌ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. పురుషోత్తపట్నం కార్యక్రమం తర్వాత చంద్రబాబు రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనకు అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.