వై.ఎస్‌.వల్లే పోల’వరం’

0
75
ఏ వేదిక మీదనైనా చర్చకు సిద్ధం
డబ్బుల ఎత్తిపోతల పథకాలపై చంద్రబాబుకు ఆసక్తి – పార్లమెంట్‌ నిధుల ఖర్చులను ప్రకటించాలి
రాజమహేంద్రవరం, జనవరి 3 : ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వల్లే సాధ్యమైందని, ఆయన కృషి లేకపోతే ఆ ఊసే ఉండేది కాదని మాజీ ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కందుల దుర్గేష్‌ అన్నారు. తన నివాసంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ రాజశేఖరరెడ్డి టైమ్‌లోనే వచ్చాయన్నారు. 2005లో స్థలానికి, పర్యావరణ అనుమతులు, 2007లో ఆర్‌.ఆర్‌. ప్యాకేజీకి అనుమతులు, 2008లో వన్య ప్రాణులు, అటవీశాఖ అనుమతులు, 2009 జనవరిలో టెక్నికల్‌ కమిటీ అనుమతులు లభించాయన్నారు. ఈ అనుమతులను సాధించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఎంతో శ్రమించారన్నారు. 1994 నుంచి తొమ్మిదేళ్ళపాటు అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడికి పోలవరం ప్రాజెక్ట్‌ ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. ఆనాటి ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు పదే పదే పోలవరం ఆవశ్యకతను తెలియజేశారని, ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులు ఉద్యమించినా ఆయనకు చీమకుట్టినట్లయినా లేకపోవడంతో పక్కన పెట్టేశారని విమర్శించారు. 2004లో ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టాక, కుడి, ఎడమ కాలువలు 75 శాతం నిర్మించారని, పదిశాతం డ్యామ్‌ పనులు జరిగాయన్నారు. 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగిపోయే ముందు విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించిందన్నారు. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఎంత కృషి చేస్తే ప్రస్తుతం   ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం తన వల్లే సాధ్యమైనదంటూ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో కాంక్రీట్‌ పనులు ఒక భాగమని, దానికి అంత హంగామా చేసుకుని వారికి వారే జబ్బలు చరుచుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో తాను చెప్పిన అంశాలపై  ఎవరైనా ఏ వేదికపైననైనా బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ఓ వైపు 2018 నాటికి పోలవరాన్ని పూర్తి చేస్తామంటూ చెబుతూ మరోవైపు రూ.1600 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదన్నారు. పోలవరం పూర్తయ్యేటప్పుడు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం అవసరమా అని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయలేమన్న అపనమ్మకంతోనే ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. కేవలం డబ్బులు దోచుకోవడానికే ఎత్తిపోతల పథకాలు చేపడుతున్నారని ధ్వజమెత్తారు. ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి ఎంత భూమిని సేకరిస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనవరి 10 నాటికి నాట్లు వేయాలంటూ కలెక్టర్‌ రైతులకు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పండించిన పంటకు డబ్బులు చేతులు రాక, బ్యాంక్‌లో ఉన్న సొమ్మును తీసుకోవడానికి అవకాశం రాక రైతులు ఇబ్బంది పడుతుంటే నాట్లు వేయండంటూ సలహాలు ఇవ్వడం సరికాదన్నారు. 50 రోజులు వేచి చూస్తే స్వర్ణయుగమని ప్రధాని మోడీ ప్రకటించారని, 50 రోజులు పూర్తయినా ఎటువంటి మార్పు కనిపించడంలేదన్నారు. ప్రధాని మోడీ గురి పెట్టింది నల్ల కుబేరులపైన కాదని, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై అని విమర్శించారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు యిచ్చే పింఛన్లు కూడా బ్యాంకు ద్వారా అందించడంఈ ప్రభుత్వానికి ఉన్న బాధ్యతారాహిత్యం స్పష్టమవుతోందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకానికి పేరు మార్చిన తెదేపా ప్రభుత్వం ఆ పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు. పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ మూడేళ్ళ పదవీ కాలంలో తనకు ఇచ్చే రూ.15కోట్ల నిధులను ఎక్కడ, ఎప్పుడు ఖర్చు చేశారో ప్రజలకు తెలపాలని, ఒక పౌరుడిగా తాను ప్రశ్నిస్తున్నానన్నారు. దీంతోపాటు రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి చేసే అభివృద్ధిని వివరాలను ప్రకటించాలన్నారు. తెడేపా ప్రభుత్వం చేపట్టిన జన్మభూమిలో ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఎన్నికలలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల ప్రజలు నిలదీస్తున్నారన్నారు. అనధికారికంగా జన్మభూమి కమిటీ అంటూ అర్హులను పక్కన పెడుతూ, అనర్హులకు పథకాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి నక్కా రాజబాబు, మాజీ సర్పంచ్‌ ఆచంట సుబ్బారాయుడు, మాజీ జెడ్పీటిసి సభ్యులు దొంతంశెట్టి వీరభద్రరావు, వెలుగుబంటి అచ్యుతరామ్‌, చిక్కాల బాబులు పాల్గొన్నారు.